ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరంలో భారీ అగ్నిప్రమాదం కలకలం రేపింది. నగరంలోని అలీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఉషా మెహతా మార్గ్ ప్రాంతంలో మూడంతస్తుల భవనంలో ఈ ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భవనం అంతటా దట్టమైన నల్లటి పొగ వ్యాపించి లోపల ఉన్నవారికి ఊపిరాడకుండా చేసింది.
ఈ ఘటనలో ఇప్పటివరకు 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఇంకా పలువురు గాయపడగా, మరికొందరీ గురించి సమాచారం తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
ఈ భవనంలో ప్రైవేట్ లైబ్రరీతో పాటు కంప్యూటర్ కోచింగ్ సెంటర్ నడుస్తున్నట్లు తెలిసింది. సోమవారం మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో మంటలు మొదలయ్యాయి. క్షణాల్లోనే పొగ వ్యాపించడంతో విద్యార్థులు, సిబ్బంది శ్వాస తీసుకోవడానికే ఇబ్బందులు పడ్డారు.
ప్రాణాలను కాపాడుకోవడానికి కొందరు విద్యార్థులు భవనం పై అంతస్తుల నుంచి కిందకు దూకడం పరిస్థితి ఎంత భయానకంగా ఉందో తెలియజేస్తోంది. స్థానికులు వెంటనే స్పందించి ప్రమాదం బారిన పడిన కొందరిని ఆసుపత్రులకు తరలించారు. ఇంకొందరు భవనం కిటికీల వద్ద నిలబడి సహాయం కోసం కేకలు వేయడం అక్కడి వారిని కలచివేసింది.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
also read: ట్రాన్స్‌జెండర్ శ్రీదేవి ఘనత: తమిళనాడులో తొలి మహిళా బస్సు డ్రైవర్‌గా చరిత్ర