రాజమహేంద్రవరం, క్రైమ్‌మిర్రర్: తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రంగంపేట మండలం వడిశలేరు – రంగంపేట మధ్య టాటా ఏస్ గూడ్స్ వాహనం టైరు పేలడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం, సామర్లకోట, పిఠాపురం ప్రాంతాలకు చెందిన కూలీలు బాపట్ల జిల్లా కొల్లూరులో రెడీమిక్స్ వాల్ నిర్మాణ పనులు పూర్తి చేసుకుని స్వగ్రామాలకు తిరిగి వస్తున్నారు.
Also Read:సమంతకు, పూనమ్ కౌర్‌కు ఎక్కడ చెడింది.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన కామెంట్స్
కూలీలతో పాటు నిర్మాణ సామగ్రిని కూడా వాహనంలో తరలిస్తుండగా ప్రమాదం సంభవించింది. మృతులను సామర్లకోటకు చెందిన మాసకపల్లి బాబు, మురమళ్ల రాజు, కాకాడ రాజుగా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన ఎనిమిది మందిని చికిత్స నిమిత్తం పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి (జీజీహెచ్) పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమికంగా టైరు పేలడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.