క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : పశ్చిమబెంగాల్ మాదిరిగానే మహారాష్ట్రలో సైతం ఎంపీల తిరుగుబాటు మొదలైందా? ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన ఎంపీలను ఆకర్షించే ప్రయత్నం జరుగుతోందా? వారంతా ఏక్ నాథ్ షిండే వర్గంలోకి షిఫ్ట్ కానున్నారా? అందుకు సంబంధించిన ఆపరేషన్ టైగర్ ప్రారంభం అయ్యిందా?? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి.
ఈశాన్య పార్టీలో విలీనం..
బెంగాల్లో మమతా బెనర్జీని విభేదిస్తూ 20 మంది ఎంపీలు వేరు శిబిరం పెట్టిన సంగతి తెలిసిందే. బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో మమతా పార్టీ ఓడిపోయిన తర్వాత పెద్ద కల్లోలం రేగింది. భారీ తిరుగుబాటు జరిగింది. ప్రధానంగా మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ని విభేదిస్తూ చాలామంది ఎంపీలు బాహటంగానే తమ వ్యతిరేకతను తెలిపారు. 20 మంది ఎంపీలు వేరు శిబిరం పెట్టి ఈశాన్య రాష్ట్రంలోని ఓ చిన్న పార్టీలో విలీనం అయ్యారు. అనంతరం ఎన్డీఏకు మద్దతు తెలిపారు. దీంతో రాజకీయంగా ఇదో సంచలన అంశంగా మారింది. బెంగాల్ పరిణామాలు మరువక ముందే ఇప్పుడు.. మహారాష్ట్ర శివసేన ఎంపీలు సైతం అదే మాదిరిగా వ్యవహరిస్తుండడం హాట్ టాపిక్ అయింది.
సంచలన ట్వీట్..
తాజాగా ఉద్దవ్ వర్గానికి చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలో శివసేన ఎంపీలని కొనుగోలు చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఒక్కొక్కరికి 15 కోట్ల రూపాయల చొప్పున అడ్వాన్స్ ఇస్తున్నారని ఆయన సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశారు. ఒక ఎంపీని లొంగదీసుకోవడానికి కనీస మద్దతు ధర 50 కోట్ల రూపాయలుగా నిర్ధారించారని.. అందులో 15 కోట్లు కేవలం అడ్వాన్స్ రూపంలో చెల్లించేందుకు సిద్ధపడ్డారని ఆయన పేర్కొనడం సంచలనంగా మారింది. అయితే ఎంపీలు తిరుగుబాటు చేస్తారన్న సమాచారంతోనే రౌత్ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కు దిగుతున్నారు అంటూ షిండే వర్గం అంటోంది.
ప్రత్యేక శిబిరంగా..
శివసేనకు మహారాష్ట్రలో 9 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు. అందులో ఆరుగురు ఎంపీలు అధికార షిండే వర్గంతో టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం నడుస్తోంది. ఇది తెలిసి ఉత్తమ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. కేవలం నలుగురు ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడంతో తిరుగుబాటు అంచనాలకు మరింత బలం చేకూరింది. ఇప్పటికే కొందరు తిరుగుబాటు ఎంపీలు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీ చేరుకుని.. లోక్సభ స్పీకర్ ను కలిసి తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని కోరినట్లు ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.