-
19న విజయోత్సవ సభ
-
తిరుపతిలో సభ సక్సెస్
-
ఆ స్ఫూర్తితో సాగరనగరంలో..
క్రైమ్ మిర్రర్, విశాఖపట్నం: ఏపీలో కూటమి పాలన రెండేళ్లు పూర్తవుతున్న తరుణంలో విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ప్రాంతాలవారీగా ఈ విజయోత్సవాలు కొనసాగుతున్నాయి. మొన్ననే తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించి గత రెండేళ్లలో సాధించిన ప్రగతి గురించి కూటమి నేతలు ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.
తొలి సభను రాయలసీమ ప్రాంతంలో నిర్వహించి విజయవంతం చేశారు. ఇప్పుడు విశాఖలో రెండో సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వారంలోనే విశాఖలో పెద్ద ఎత్తున సభను నిర్వహించి ఉత్తరాంధ్ర ప్రజలకు గట్టి సంకేతాలు పంపాలని చూస్తోంది కూటమి ప్రభుత్వం.
-
మోడీ పుష్కర పదవి సంబరాలు..
విశాఖలో నిర్వహించబోయే సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. ఏపీలో కూటమి పాలనతో పాటు కేంద్రంలో నరేంద్ర మోడీ పుష్కర పాలనను కూడా సంబరాల రూపంలో విశాఖలో జరుపుకోవాలని చూస్తున్నారు.
ప్రధానంగా విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేసిన నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తో పాటు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి సైతం హాజరయ్యే అవకాశం ఉంది ఈ విజయోత్సవాలకు.
ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో..
విశాఖలో కూటమి ప్రభుత్వ విజయోత్సవ సభకు సంబంధించి స్థలాన్ని కూడా ఎంపిక చేశారు. ఈనెల 19న విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో ఈ సభ నిర్వహణకు డిసైడ్ అయ్యారు. ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. వేలాదిమంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
ఉత్తరాంధ్రలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా నేతలు ప్రజలకు తెలియజేస్తారు. రెండేళ్లలో పెద్ద ఎత్తున పరిశ్రమలు,, పారిశ్రామిక పెట్టుబడులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల గురించి ప్రజలకు వివరిస్తారు కూటమి నేతలు.
ఉత్తరాంధ్ర పై ఫోకస్..
కూటమికి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది ఉత్తరాంధ్ర. 2024 ఎన్నికల్లో 34 అసెంబ్లీ స్థానాలకు గాను 32 చోట్ల ఘన విజయం సాధించింది. అదే పట్టును మరోసారి నిలుపుకోవాలని చూస్తోంది కూటమి. అందుకే ఈ విజయోత్సవ సభ ద్వారా మూడు పార్టీల క్యాడర్లో ఉత్సాహాన్ని నింపాలని భావిస్తోంది.
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సైతం సన్నాహాలు ప్రారంభమైన నేపథ్యంలో.. విశాఖలో ఈ విజయోత్సవ సభ కూటమి క్యాడర్లో ఉత్సాహం నింపుతుందని అంచనా వేస్తోంది నాయకత్వం. మరో రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో.. కూటమి నేతలు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.