ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలో సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వీడియోను నిజమని నమ్మడం ప్రమాదకరమని మరోసారి స్పష్టమైంది. తాజాగా ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన కీలక మ్యాచ్ అనంతరం ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఆ వీడియోలో పాకిస్తాన్ మహిళా క్రికెటర్ ఒకరు భారత బ్యాటర్‌పై మైదానంలోనే దాడి చేసినట్లు, అనంతరం అంపైర్లు, ఇతర ఆటగాళ్లు వచ్చి ఇద్దరినీ విడదీసినట్లు చూపించారు. ఈ దృశ్యాలు వైరల్ కావడంతో క్రికెట్ అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. నిజంగా మ్యాచ్ సందర్భంగా ఇలాంటి ఘర్షణ జరిగిందా అంటూ అనేక మంది సందేహాలు వ్యక్తం చేశారు.
Sherni #indvspak pic.twitter.com/21yjTnK1gi
— Sunil Gavaskar (@virender_swag) June 14, 2026
అయితే ఈ వైరల్ వీడియోపై జరిగిన పరిశీలనలో అసలు విషయం బయటపడింది. మైదానంలో ఎలాంటి గొడవ, వాగ్వాదం లేదా భౌతిక దాడి జరగలేదని స్పష్టమైంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సృష్టించిన నకిలీ దృశ్యమని పలు నివేదికలు వెల్లడించాయి. ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య ఎలాంటి ఘర్షణ చోటుచేసుకోలేదని, వ్యూస్ మరియు సంచలనం కోసం కొందరు ఈ తప్పుడు వీడియోను రూపొందించి ప్రచారం చేశారని తేలింది.
వాస్తవానికి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన 68 పరుగులతో అద్భుత అర్ధశతకం సాధించగా, చివర్లో రిచా ఘోష్ వేగవంతమైన 34 పరుగులతో జట్టుకు బలమైన స్కోరు అందించింది.
171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు ఆరంభంలో కొంత ప్రతిఘటన చూపించినప్పటికీ భారత బౌలర్ల ధాటికి కుప్పకూలింది. ముఖ్యంగా భారత స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ అద్భుత ప్రదర్శనతో 5 వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ బ్యాటింగ్‌ను దెబ్బతీసింది. ఆమె 5 వికెట్ల ప్రదర్శన భారత మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచింది. పాకిస్తాన్ జట్టు 106 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ 64 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
ఈ విజయంతో భారత్ టోర్నీని ఘనంగా ఆరంభించగా, దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మ్యాచ్ అనంతరం ఆమె జట్టు సభ్యుల సహకారంతోనే ఈ ప్రదర్శన సాధ్యమైందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షించిన ఈ మ్యాచ్ మహిళల క్రికెట్లో అత్యధిక ఆసక్తిని రేకెత్తించిన పోరాటాల్లో ఒకటిగా నిలిచింది. అయితే మైదానంలో ఎంతో క్రీడాస్ఫూర్తితో ముగిసిన ఈ మ్యాచ్‌ను కొందరు సైబర్ అల్లరి మూకలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో తప్పుడు వీడియోగా మార్చి ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారింది. నిపుణులు మాత్రం ఇలాంటి వీడియోలను నమ్మే ముందు వాటి నిజానిజాలు తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు.
ALSO READ: మామూలోళ్లు కాదు.. ఏకంగా ఇంట్లోనే..