క్రైమ్ మిర్రర్ : జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. కుల్గామ్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు వలస కూలీలు లక్ష్యంగా మారారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. అధికారుల వివరాల ప్రకారం.. కుల్గామ్ జిల్లా కెల్లామ్ ప్రాంతంలో పనిచేస్తున్న ఇద్దరు వలస కూలీలపై గుర్తుతెలియని ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరూ తీవ్రంగా గాయపడగా, స్థానికులు, భద్రతా సిబ్బంది వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ ఒక కార్మికుడు మృతి చెందగా, మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో అనంత్‌నాగ్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సైన్యం, ఇతర భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో కుల్గామ్ జిల్లాలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలింపు కొనసాగిస్తున్నాయి.
also read :అగ్గిపెట్టె ఇవ్వలేదని ఆగ్రహం.. మద్యం దుకాణానికి నిప్పు పెట్టిన వ్యక్తి
