క్రైమ్ మిర్రర్ : మహారాష్ట్రలో భారీ వర్షాలు మరో విషాదానికి కారణమయ్యాయి. వరద ఉద్ధృతికి ఓ కారు కొట్టుకుపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి చెందగా, కుటుంబ పెద్ద ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యవత్మాల్ జిల్లాకు చెందిన అవినాష్ ఖందారే తన భార్య మాధవి, ఇద్దరు కుమార్తెలతో కలిసి కారులో అహిల్యానగర్ జిల్లాలోని లోని ప్రాంతానికి గురువారం బయలుదేరారు. అదే సమయంలో కురుస్తున్న భారీ వర్షాలకు ధార్మా ప్రాంతంలోని కుప్తీ నది ఉప్పొంగి ప్రవహించింది. వరద నీరు వంతెనపైకి చేరడంతో అక్కడ ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే నీటి ప్రవాహం తీవ్రతను గుర్తించలేక అవినాష్ కారును వంతెనపైకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఒక్కసారిగా ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో కారు కొట్టుకుపోయింది. కారులో ఉన్న నలుగురూ ప్రవాహంలో చిక్కుకున్నారు. ఈ ఘటనలో అవినాష్ సమయస్ఫూర్తితో కారు నుంచి బయటపడి సమీపంలోని చెట్టును పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్నాడు. అయితే అతడి భార్య మాధవి, ఇద్దరు కుమార్తెలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించాయి. గంటల తరబడి కొనసాగిన సహాయక చర్యల అనంతరం శుక్రవారం యవత్మాల్ జిల్లా పరిధిలో తల్లి, ఇద్దరు కుమార్తెల మృతదేహాలను గుర్తించి వెలికితీశారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, భారీ వర్షాల సమయంలో వరద ప్రవాహం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
also read : LPG వినియోగదారులకు అలర్ట్: ఈ-KYC తప్పనిసరి – లేకపోతే గ్యాస్ బుకింగ్, సబ్సిడీ నిలుపుదల!
