క్రైమ్ మిర్రర్ : సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌తో తనకు విభేదాలు ఉన్నాయన్న ప్రచారాన్ని కాక్రోచ్ జనతాపార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఖండించారు. నీట్ పేపర్ లీక్ ఉద్యమంలో వాంగ్‌చుక్ చేసిన పోరాటం, త్యాగాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని స్పష్టం చేశారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, పలు అంశాల్లో ఏకాభిప్రాయం ఉందని తెలిపారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిజీత్ దీప్కే ఈ వ్యాఖ్యలు చేశారు. ఆందోళన ముగింపు సందర్భంగా సోనమ్ వాంగ్‌చుక్ పేరు ప్రస్తావించకపోవడానికి విభేదాలే కారణమన్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను వాంగ్‌చుక్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు కూడా వెల్లడించారు. నాటి ఆందోళనను యువత ముందుండి నడిపించిందని, వారు పోలీసుల చర్యలను ఎదుర్కొంటూ పోరాడారని అభిజీత్ తెలిపారు. అందుకే తన ప్రసంగంలో యువతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపానని వివరించారు.
వాంగ్‌చుక్ దీక్షతోనే కీలక పరిణామాలు: అభిజీత్
సోనమ్ వాంగ్‌చుక్ 26 రోజుల పాటు చేపట్టిన ఆమరణ దీక్షను అభిజీత్ దీప్కే గుర్తు చేశారు. దేశ సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆయన చేసిన పోరాటం ఎంతో గొప్పదని అన్నారు. “వాంగ్‌చుక్ సర్ త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. ఆయన తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆమరణ దీక్ష చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. యువతను రోడ్లపైకి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా చేశారు” అని అభిజీత్ పేర్కొన్నారు. వాంగ్‌చుక్ దీక్ష చేపట్టకపోతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా జరిగేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. దీక్ష విరమించాలని తాను వ్యక్తిగతంగా పలుమార్లు కోరినట్లు తెలిపారు.
వాంగ్‌చుక్‌ను కలిసేందుకు అనుమతి ఇవ్వకపోవడంపై అసంతృప్తి
కేంద్ర మంత్రుల సమక్షంలో సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమించడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అభిజీత్ చెప్పారు. అయితే ఆసుపత్రిలో ఉన్న సమయంలో వాంగ్‌చుక్‌ను కలిసేందుకు తనకు అనుమతి ఇవ్వకపోవడం బాధ కలిగించిందని తెలిపారు. కేంద్ర మంత్రులకు మాత్రమే అవకాశం కల్పించి, ఇతర సీజేపీ సభ్యులు, ప్రతిపక్ష నాయకులను కలిసేందుకు అనుమతించలేదని ఆయన ఆరోపించారు. ఒక దశలో కేంద్రం వాంగ్‌చుక్‌ను నిర్బంధించినట్లుగా అనిపించిందని వ్యాఖ్యానించారు. అయితే ఆయన దీక్ష విరమించారని తెలిసి ఊపిరి పీల్చుకున్నానని, దేశ భవిష్యత్తుకు వాంగ్‌చుక్ వంటి వ్యక్తులు అవసరమని అభిజీత్ అన్నారు.
రాజకీయ పార్టీగా మారే ఆలోచన లేదు
కాక్రోచ్ జనతాపార్టీని రాజకీయ పార్టీగా మార్చే ఉద్దేశం లేదని అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ప్రజా ఒత్తిడి తీసుకొచ్చే ఒక ప్రెషర్ గ్రూప్‌గా మాత్రమే కొనసాగుతామని తెలిపారు. ప్రభుత్వంలో జవాబుదారీతనం పెంచడమే తమ లక్ష్యమని, తాను రాజకీయ నాయకుడిగా మారే ఆలోచన లేదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో అర్థవంతమైన మార్పులు ప్రజా ఉద్యమాల ద్వారానే సాధ్యమవుతాయని అభిప్రాయపడ్డారు.
also read : డబ్బుల వివాదం.. కూతురిపై తండ్రి దాడి
