Homeజాతీయంరైళ్లు లేవు… పరీక్షలు ఉన్నాయి!

రైళ్లు లేవు… పరీక్షలు ఉన్నాయి!

  • – పాట్నాలో విద్యార్థుల నిరసన

బిహార్‌లో పోలీస్ ప్రొహిబిషన్ విభాగం పరీక్షలకు హాజరయ్యేందుకు వచ్చిన వేలాది మంది అభ్యర్థుల నిరసన పాట్నాలో ఉద్రిక్తంగా మారింది. ముఖ్యంగా పాటలీపుత్ర రైల్వే స్టేషన్ వద్ద పరిస్థితి అదుపు తప్పి హింసాత్మకంగా మారడం కలకలం రేపింది.

పరీక్షల కోసం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు తమ ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవడానికి రైళ్లపై ఆధారపడ్డారు. అయితే, రైళ్లు సమయానికి అందుబాటులో లేకపోవడంతో స్టేషన్‌లో భారీగా గుమిగూడిన అభ్యర్థులు తీవ్ర అసహనానికి గురయ్యారు. గంటల తరబడి ఎదురు చూడాల్సి రావడం, సరైన సౌకర్యాలు లేకపోవడం వారి ఆగ్రహానికి కారణమైంది.

ఈ క్రమంలో నిరసనకారులు రైల్వే పట్టాలపై కూర్చుని రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. కొందరు ట్రాక్‌లను పూర్తిగా బ్లాక్ చేసి రైళ్లను నిలిపివేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రైల్వే భద్రతా సిబ్బంది, పోలీసులు ముందుకు వచ్చారు. మొదట విద్యార్థులను సముదాయించే ప్రయత్నం చేసినా, వారు వెనక్కి తగ్గలేదు.

దీంతో భద్రతా సిబ్బంది బలవంతంగా వారిని తొలగించే ప్రయత్నం చేయగా ఉద్రిక్తత మరింత పెరిగింది. ఆగ్రహించిన నిరసనకారులు రాళ్ల దాడికి దిగడంతో ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసి, టియర్ గ్యాస్ ప్రయోగించారు.

ఈ ఘటనలో ఓ రైలు అద్దాలు పగిలిపోయాయి. స్టేషన్ ప్రాంగణంలోని కుర్చీలు, ఫ్యాన్లు ధ్వంసమయ్యాయి. ఘటన తర్వాత అక్కడ భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.ప్రస్తుతం పరిస్థితిని ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. రైల్వే, పోలీసు విభాగాలు సమన్వయంతో పని చేస్తూ స్టేషన్ పరిసరాల్లో శాంతి భద్రతలను కాపాడే చర్యలు చేపడుతున్నాయి.

also read: సర్కార్ ఎక్స్ ప్రెస్ లో చోరీ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు