AP Teachers Finland Training: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం వినూత్న చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులను ఫిన్లాండ్కు పంపించి అక్కడి ఆధునిక విద్యా విధానాలను నేర్చుకునే అవకాశం కల్పిస్తోంది. గత ఏడాది ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు అందుకున్న 29 మందిని ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఎంపిక చేశారు.
Also Read: Bengaluru Murder Case: అనుమానం పెనుభూతమై.. ప్రియురాలిని కడతేర్చిన ఉన్మాది!
ప్రత్యేక శిక్షణ
ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మూడు దశల్లో నిర్వహించనున్నారు. తొలి దశలో జూన్ 13 నుంచి 17 వరకు విజయవాడలోని లయోలా కాలేజీలో శిక్షణ ఇవ్వనున్నారు. ఫిన్లాండ్ విద్యా నిపుణులు ప్లే బేస్డ్ లెర్నింగ్, ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ వంటి అంశాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించనున్నారు.
ఫిన్లాండ్ పర్యటన
రెండో దశలో ఆగస్టు 17 నుంచి 26 వరకు ఎంపికైన ఉపాధ్యాయులు ఫిన్లాండ్లోని తుర్కు, రౌమా నగరాలను సందర్శించనున్నారు. అక్కడి ప్రీ-స్కూళ్లు, టీచర్ ట్రైనింగ్ సెంటర్లు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లలో బోధనా విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థగా గుర్తింపు పొందిన ఫిన్లాండ్లో విద్యార్థుల సృజనాత్మకత, ఆలోచనా సామర్థ్యాలను పెంపొందించే విధానాలను అధ్యయనం చేయనున్నారు.
స్కూళ్లలో అమలు
మూడో దశలో ఫిన్లాండ్లో నేర్చుకున్న పద్ధతులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయనున్నారు. తుర్కు యూనివర్సిటీ నిపుణులు ఆన్లైన్ మెంటారింగ్ ద్వారా ఉపాధ్యాయులకు సహకారం అందించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయుల వృత్తిపరమైన నైపుణ్యాలు పెరగడంతో పాటు విద్యార్థుల అభ్యసన ఫలితాలు కూడా మెరుగుపడతాయని అధికారులు భావిస్తున్నారు.
సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ప్రభుత్వ విద్యను ఆధునికీకరించడంలో కీలక మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. ఫిన్లాండ్లో నేర్చుకున్న అనుభవాలను ఇతర ఉపాధ్యాయులతో పంచుకోవడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో సానుకూల మార్పులు తీసుకురావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: Yogi Adityanath: అఖిలేష్ కుమార్తెపై ట్రోలింగ్.. సీఎం యోగి సీరియస్!
Also Read: చేపల కోసం వేస్తే మొసలి చిక్కింది