గత కొన్ని నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగించిన పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తగ్గుముఖం పట్టాయి. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఒప్పందంతో ప్రాంతీయ స్థిరత్వానికి మార్గం సుగమమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
హోర్ముజ్ జలసంధి ఓపెన్ అవుతుంది!
ఒప్పందంలో భాగంగా ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హోర్ముజ్ జలసంధి మళ్లీ సాధారణ రవాణాకు అందుబాటులోకి రానుందని ట్రంప్ తెలిపారు. నౌకల రాకపోకలపై ఉన్న అడ్డంకులను తొలగించాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. అలాగే ఇరాన్‌కు సంబంధించిన ఓడరేవులపై అమల్లో ఉన్న దిగ్బంధన చర్యలను ఎత్తివేస్తున్నట్లు వెల్లడించారు. అమెరికా నేవీ చేపట్టిన సముద్ర దిగ్బంధనాన్ని కూడా నిలిపివేస్తున్నామని ట్రంప్ వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటుందని, నౌకలు తిరిగి ప్రయాణాలు ప్రారంభించాలని ఆయన పిలుపునిచ్చారు. చమురు రవాణా కూడా యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు.
ఇరాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ పరిణామాలపై ఇరాన్ ప్రభుత్వం కూడా స్పందించింది. అమెరికాతో అవగాహన ఒప్పందం కుదిరిన విషయాన్ని ధృవీకరించింది. ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి ఘరీబా బాదీ మాట్లాడుతూ, రెండు దేశాల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల ఫలితంగానే ఈ ఒప్పందం సాధ్యమైందన్నారు. దాదాపు 60 రోజుల పాటు జరిగిన చర్చల అనంతరం ఒక అంగీకారానికి వచ్చినట్లు వెల్లడించారు. ఈ నెల 19న స్విట్జర్లాండ్‌లో అధికారికంగా ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. అయితే ఒప్పందం కుదిరిందని మాత్రమే అమెరికాను పూర్తిగా విశ్వసిస్తున్నామని అర్థం కాదని స్పష్టం చేశారు. అమెరికా ఇచ్చిన హామీలను అమలు చేస్తుందా? లేదా? అన్న విషయాన్ని నిశితంగా గమనిస్తామని పేర్కొన్నారు.
ఈ శాంతి ఒప్పందం కారణంగా లెబనాన్‌తో పాటు పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న సైనిక చర్యలు కూడా నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గి, శాంతి వాతావరణం నెలకొనే అవకాశాలపై అంతర్జాతీయ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.