ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు తీసుకోవడం ఎంత ముఖ్యమో వైద్య నిపుణులు ఎప్పటికప్పుడు సూచిస్తుంటారు. అయితే కేవలం పండ్లు తినడమే సరిపోదని, వాటిలో ఉండే పోషక విలువలపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఫ్లేవనాల్స్ అనే ప్రత్యేక యాంటీఆక్సిడెంట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అమెరికా, బ్రిటన్ దేశాలకు చెందిన సుమారు 30,000 మందిపై నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు తింటున్న వారిలో కూడా గుండెకు అవసరమైన ఫ్లేవనాల్స్ సరిపడా అందడం లేదని పరిశోధకులు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 5 మందిలో కేవలం ఒక్కరు మాత్రమే శరీరానికి అవసరమైన స్థాయిలో ఈ పోషకాలను పొందుతున్నట్లు అధ్యయనం వెల్లడించింది.
ఫ్లేవనాల్స్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా రక్తప్రసరణ వ్యవస్థ పనితీరును బలోపేతం చేస్తాయి. రక్తనాళాల స్థితిస్థాపకతను పెంచడం, శరీరంలో వాపులను తగ్గించడం, గుండెపై ఒత్తిడిని తగ్గించడం వంటి ప్రయోజనాలను అందిస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజుకు కనీసం 500 మిల్లీగ్రాముల ఫ్లేవనాల్స్ శరీరానికి అందడం గుండె ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఈ మోతాదును పొందేందుకు ప్రత్యేకమైన ఆహార పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది.
ప్లమ్స్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాయి. 500 గ్రాముల ప్లమ్స్ ద్వారా సుమారు 450 మిల్లీగ్రాముల ఫ్లేవనాల్స్ లభిస్తాయి. 250 గ్రాముల క్రాన్‌బెర్రీస్ ద్వారా 300 మిల్లీగ్రాములు, 200 గ్రాముల బ్లాక్‌బెర్రీస్ ద్వారా 250 మిల్లీగ్రాములు అందుతాయి. అలాగే 250 మిల్లీలీటర్ల గ్రీన్ టీ ద్వారా 200 మిల్లీగ్రాముల వరకు ఫ్లేవనాల్స్ లభిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. 80 గ్రాముల బ్రాడ్ బీన్స్ ద్వారా 140 మిల్లీగ్రాములు, 400 గ్రాముల చెర్రీస్ ద్వారా 130 మిల్లీగ్రాములు లభిస్తాయి. తొక్క తీయకుండా ఒక మధ్యస్థ పరిమాణంలో ఉన్న ఆపిల్ తింటే సుమారు 110 మిల్లీగ్రాముల ఫ్లేవనాల్స్ అందుతాయి. 200 గ్రాముల స్ట్రాబెర్రీస్‌లో 90 మిల్లీగ్రాములు, 150 గ్రాముల బ్లూబెర్రీస్‌లో 80 మిల్లీగ్రాములు, రెండు టేబుల్ స్పూన్ల పింటో బీన్స్‌లో 70 మిల్లీగ్రాముల వరకు ఫ్లేవనాల్స్ ఉంటాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
చాలామంది డార్క్ చాక్లెట్‌ను కూడా గుండె ఆరోగ్యానికి ఉపయోగకరమైన ఆహారంగా భావిస్తారు. ఇందులో ఉండే కోకో కారణంగా కొంతమేర ఫ్లేవనాల్స్ లభించినప్పటికీ, మార్కెట్లో లభించే చాక్లెట్లలో వాటి పరిమాణం స్థిరంగా ఉండదని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా రెండు లేదా మూడు ముక్కల డార్క్ చాక్లెట్ ద్వారా 22 నుంచి 73 మిల్లీగ్రాముల మధ్య మాత్రమే ఫ్లేవనాల్స్ లభిస్తాయి. మిల్క్ చాక్లెట్‌లో అయితే ఈ పరిమాణం మరింత తక్కువగా ఉంటుంది. అందువల్ల పండ్లు, కూరగాయల ద్వారా సహజసిద్ధంగా ఈ పోషకాలను పొందడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
రీడింగ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ గుంటర్ కున్లే మాట్లాడుతూ ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు తినడం మంచి అలవాటేనని, అయితే ఏ రకమైన పండ్లు తింటున్నామన్నది కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి పండులో వేర్వేరు రకాల పోషకాలు ఉంటాయని, విభిన్న రకాల పండ్లను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా శరీరానికి సమగ్ర పోషకాలు అందుతాయని వివరించారు.
అయితే ఈ అంశంపై అందరూ ఒకే అభిప్రాయంలో లేరు. బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్‌తో పాటు కొందరు గుండె నిపుణులు ఫ్లేవనాల్స్ ప్రయోజనాలపై మరిన్ని అధ్యయనాలు అవసరమని చెబుతున్నారు. ఒక్కో వ్యక్తి శరీరంలో ఉండే జీర్ణవ్యవస్థ సూక్ష్మజీవుల స్వభావం ఆధారంగా పోషకాల గ్రహణశక్తి మారుతుందని, కాబట్టి కేవలం ఒకే రకమైన పోషకంపై ఆధారపడకుండా అన్ని రకాల పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పప్పులతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం అత్యంత సురక్షితమైన మార్గమని సూచిస్తున్నారు.
NOTE: పైన తెలిపిన వార్తా సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సరైన వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.
ALSO READ: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి కేంద్రం శుభవార్త