Homeఆంధ్ర ప్రదేశ్ఉత్తరాంధ్రలో కొత్త అధ్యయనం...!

ఉత్తరాంధ్రలో కొత్త అధ్యయనం…!

  • విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం

  • తాత్కాలిక భవనంలో కార్యాలయ నిర్వహణ

  • కొలువుదీరిన ఉన్నతాధికారులు

క్రైమ్ మిర్రర్, విశాఖపట్నం: ఉత్తరాంధ్రవాసుల కల ఎట్టకేలకు ఫలించింది. సోమవారం నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. విశాఖ నడిబొడ్డున ఉన్న డెక్ భవనంలో అడుగుపెట్టారు దక్షిణ కోస్తా జోన్ రైల్వే ఉన్నతాధికారులు. జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు కొలువుదీరారు.

దీంతో దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు మొదలైనట్టే. ప్రస్తుతం విశాఖలోని ముడసర్లోవలో రైల్వే జోన్ కు సంబంధించి శాశ్వత భవన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వీలైనంత త్వరగా పూర్తిచేసి శాశ్వత కార్యాలయాల్లోకి మారనుంది విశాఖ దక్షిణ కోస్తా రైల్వే జోన్.

18వ జోన్ గా..
దేశంలో 17 రైల్వే జోన్లు పనిచేస్తున్నాయి. విశాఖ కేంద్రంగా ప్రారంభమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ 18వది. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ కేటాయిస్తామని కేంద్రం విభజన చట్టంలో పేర్కొంది. దాని ప్రకారం 2018లో ప్రత్యేక రైల్వే జోన్ విశాఖ కేంద్రంగా ప్రకటించింది.

కానీ అప్పటి రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ఎన్నికలు సమీపించడంతో దానికి సంబంధించిన కార్యాచరణ ప్రారంభం కాలేదు. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడం.. కేంద్రంలో టిడిపి కీలక భాగస్వామి కావడంతో మరోసారి రైల్వే జోన్ అంశంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది కేంద్రం. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ను ప్రకటించడమే కాదు.. కార్యాలయాలకు సంబంధించి శాశ్వత భవన నిర్మాణ పనులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు కూడా.

అంతవరకు తాత్కాలిక కార్యాలయ భవనానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విశాఖ నడిబొడ్డున ఉన్న డెక్ భవనాన్ని కేటాయించింది. అంతేకాకుండా జూన్ 1 నుంచి కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని కేంద్ర రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అందుకు తగ్గట్టుగానే సోమవారం నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. ఎన్నో ఏళ్లుగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది.

నాలుగు డివిజన్లతో..
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి నాలుగు రైల్వే డివిజన్లు చేర్చారు. ఇప్పటివరకు దక్షిణ మధ్య రైల్వే జోన్ లో ఉన్న విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు విశాఖ రైల్వే జోన్ లో చేర్చారు. ఇప్పటివరకు వాల్తేరు డివిజన్ ఉండగా దానిని పునర్వ్యవస్థీకరించి విశాఖ డివిజన్ గా మార్చారు. తూర్పు కోస్తా రైల్వే జోన్లోని ఖుర్దా డివిజన్లో ఉన్న ఉత్తరాంధ్రలోని చాలా స్టేషన్లను విశాఖ డివిజన్లోనూ.. విశాఖ జోన్ లో చేర్చారు.

3,532 కిలోమీటర్ల రైల్వే లైన్ విస్తరించి ఉంది ఈ కొత్త జోన్ లో. 385 రైల్వేస్టేషన్లో కూడా ఈ జోన్ పరిధిలో ఉన్నాయి. 62,000 మంది ఉద్యోగులు సేవలు అందించనున్నారు. 100 మిలియన్ టన్నుల వరకు సరుకు రవాణా జరగనుంది. ఈ కొత్త రైల్వే జోన్ ద్వారా రూ.15,500 కోట్ల వార్షిక ఆదాయం సమకూరనుంది. ఉత్తరాంధ్రలో వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తుల రవాణాకు మార్గం సుగమం అయింది. అనేక కొత్త రైలు సర్వీసులు ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభం కానున్నాయి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు