హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పెద్ది కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు, వీడియో గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి.
రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ను వేగంగా కొనసాగిస్తోంది. తాజాగా విజయవాడలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సినీ ప్రముఖులు, సినిమా టీమ్ హాజరై సందడి చేశారు. ఈ వేడుకలో నటుడు జగపతిబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానుల్లో మరింత ఉత్సాహం పెంచుతున్నాయి.
జగపతిబాబు మాట్లాడుతూ విజయవాడ వాళ్లు మామూలు వాళ్లు కాదని, పెద్ది టీమ్‌ను, రామ్ చరణ్‌ను ఇక్కడికి తీసుకురావడం చాలా ఆనందంగా ఉందన్నారు. తాను విజయవాడలోనే పుట్టి పెరిగానని గుర్తుచేసుకుంటూ.. పెద్ది సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా నిలిచే సినిమా అవుతుందని చెప్పారు.
అలాగే అరవింద సమేత తర్వాత తనకు మంచి పాత్ర దొరికింది ఈ సినిమాలోనే అని చెప్పారు. రామ్ చరణ్ మెగా పవర్ ఏంటో పెద్ది సినిమాలో ప్రేక్షకులకు స్పష్టంగా కనిపిస్తుందని.. ప్రతి సీన్‌లో చరణ్ అదరగొట్టాడని ప్రశంసించారు.
మెగాస్టార్ చిరంజీవితో ఒకసారి మాట్లాడినప్పుడు.. చరణ్ నటుడిగా మాత్రమే కాదు, మంచి మనిషిగా కూడా చాలా ఎదిగాడని ఆయన చెప్పారని.. అదే విషయాన్ని తాను సినిమా సెట్స్‌లో దగ్గరగా చూసానని జగపతిబాబు తెలిపారు.
దర్శకుడు బుచ్చిబాబుపై కూడా ఆయన ప్రశంసలు కురిపించారు. కనిపించడానికి చిన్నగా ఉన్నా అతనిలో టాలెంట్ ఎంతో ఉందని.. ప్రతి పాత్రను డిజైన్ చేసిన తీరు అద్భుతమన్నారు. అలాగే సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ సినిమాకు మరో హైలైట్ అవుతుందని చెప్పారు.
హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా సినిమాలో చాలా బాగా నటించిందని.. ఇలాంటి టీమ్‌తో కలిసి పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని జగపతిబాబు తెలిపారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.