HomeజాతీయంNEET 2026 Re-Test: రంగంలోకి ఎయిర్ ఫోర్స్.. పకడ్బందీగా నీట్ రీ ఎగ్జామ్‌ ప్రశ్నపత్రాల రవాణా!

NEET 2026 Re-Test: రంగంలోకి ఎయిర్ ఫోర్స్.. పకడ్బందీగా నీట్ రీ ఎగ్జామ్‌ ప్రశ్నపత్రాల రవాణా!

నీట్ పరీక్ష పేపర్ లీక్ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి పరీక్ష నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. జూన్ 21న జరగనున్న ఈ పరీక్షను ఎలాంటి అవకతవకలు లేకుండా నిర్వహించేందుకు కేంద్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా ప్రశ్నపత్రాల భద్రత విషయంలో ఈసారి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఎయిర్ ఫోర్స్ సాయంతో ప్రశ్నాపత్రాల రవాణా

ఈసారి ప్రశ్నపత్రాల రవాణా కోసం భారత వైమానిక దళం సేవలను వినియోగించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. పరీక్షకు సంబంధించిన ప్రతి దశను అత్యంత రహస్యంగా, భద్రంగా నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏర్పాట్లపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ నివాసంలో కీలక సమావేశం జరిగినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రధాని కార్యాలయానికి చెందిన అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్టు సమాచారం. ప్రశ్నపత్రాల రూపకల్పన నుంచి ప్రింటింగ్, రవాణా, పంపిణీ వరకు ప్రతి దశలో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తోంది. పరీక్ష ప్రక్రియ మొత్తం నేరుగా ప్రధాన మంత్రి కార్యాలయం పర్యవేక్షణలోనే కొనసాగుతోంది.

ఈసారి 23 లక్షల మంది విద్యార్థుల హాజరు

ఈ ఏడాది మే 3న దేశవ్యాప్తంగా 551 నగరాల్లో నీట్ పరీక్ష నిర్వహించారు. 22 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. అయితే తర్వాత పేపర్ లీక్ ఆరోపణలు వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో మే 12న కేంద్ర ప్రభుత్వం పరీక్షను రద్దు చేసింది. ఈ ఘటనపై అసలు నిజాలు వెలికితీసేందుకు సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోంది. ఇదే సమయంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జూన్ 21న మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి సుమారు 23 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో జరిగిన లోపాలు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కేంద్రం చెబుతోంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు