Homeతెలంగాణఈటెల, డీకేలలో ఎవరికి పదవి...? వేడెక్కిన తెలంగాణ బీజేపీ రాజ‌కీయం...

ఈటెల, డీకేలలో ఎవరికి పదవి…? వేడెక్కిన తెలంగాణ బీజేపీ రాజ‌కీయం…

హైదరాబాద్, క్రైమ్ మిర్ర‌ర్‌: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం త్వరలోనే భారీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, తెలంగాణ బీజేపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రం నుంచి ఎవరికి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కబోతోంది? ఎవరి పదవి ఊడనుంది? ఎవరికి కొత్త బాధ్యతలు రానున్నాయి? అనే అంశాలపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది.ప్రస్తుత సమీకరణాల ప్రకారం.. తెలంగాణ నుంచి
కేంద్ర మంత్రివర్గంలో ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ల పదవులకు ప్రస్తుతానికైతే ఎలాంటి ఢోకా లేదని ఢిల్లీ వర్గాల సమాచారం. అయితే, వారి శాఖల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది.

కేంద్రంలో కిషన్ రెడ్డి పరపతి రోజురోజుకూ పెరుగుతోంది. అధిష్టానం వద్ద ఆయన మాటకే కీలక ప్రాధాన్యత లభిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక నుంచి మంత్రుల కోటా వరకు ఆయన అభిప్రాయం కీలకంగా మారింది. అయితే, మరోవైపు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పదవిపై వస్తున్న ఊహాగానాలకు అధిష్టానం చెక్ పెట్టినట్లు తెలుస్తోంది. కొడుకు వివాదం నేపథ్యంలో మంత్రి పదవి నుంచి తొలగిస్తారనే ప్రచారం సాగినప్పటికీ, అధిష్టానం బండి జోలికి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు .గతంలో ఆయనను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడం వల్ల పార్టీ నష్టపోయిందని భావిస్తున్న హైకమాండ్, ఇప్పుడు మంత్రి పదవి నుంచి తప్పిస్తే మరింత ప్రతికూల ప్రభావం పడుతుందని అంచనా వేస్తోంది.

రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సైతం బండి సంజయ్ కుటుంబ వ్యవహారంపై డిఫెన్స్ చేస్తూ, అది చట్టపరిధిలోని అంశమని క్లీన్ చీట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కిషన్ రెడ్డి కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా మిన్నకుండిపోయారు.మంత్రివర్గంలో కొత్తగా స్థానం సంపాదించుకునేందుకు రాష్ట్రం నుంచి గట్టి పోటీ నెలకొంది. కేంద్ర మంత్రి పదవి ఆశించిన వారిలో ధర్మపురి అర్వింద్‌తో పాటు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ ప్రధానంగా ఉన్నారు. బండి సంజయ్‌ను బర్తరఫ్ చేస్తే ఆ పదవి తనకే దక్కుతుందని అర్వింద్ ఆశలు పెట్టుకున్నప్పటికీ, బండి కంటిన్యూ అవుతుండటంతో ఆయన ఆశలు అడియాశలయ్యేలా కనిపిస్తున్నాయి.

మరోవైపు రఘునందన్ రావు పేరును అధిష్టానం సీరియస్‌గా పరిగణించడం లేదని తెలుస్తోంది.ప్రస్తుతం రేసులో అందరికంటే ముందు వరుసలో నిలిచింది ఇద్దరే. ఒకరు ఈటల రాజేందర్ కాగా, మరొకరు డీకే అరుణ. రాష్ట్రం నుంచి ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉన్నందున, వీరిద్దరికీ కలిపి పదవులు ఇవ్వడం కష్టమే. దీంతో ఈ ఇద్దరిలో ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠ రేపుతోంది.ఈటల రాజేందర్ మంత్రి పదవి కోసం గట్టిగానే ప్రయత్నాలు సాగిస్తున్నారు. గతంలో పార్టీలో చేరిన సమయంలో ఆయనకు అధిష్టానం ఇచ్చిన హామీలు కూడా ఉన్నాయి. పైగా ఈటల బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం, ఆయన సతీమణి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో, ఆయనకు పదవి ఇస్తే రెండు వర్గాల నుంచి పార్టీకి మైలేజ్ వస్తుందని బీజేపీ భావించింది.

ఇందులో కిషన్ రెడ్డి అభిప్రాయం అత్యంత కీలకంగా మారనుంది. కిషన్ రెడ్డి గనుక తన వీటో పవర్ ఉపయోగిస్తే, ఈటల కంటే డీకే అరుణ వైపే ఆయన మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి కిషన్ రెడ్డి మాటను పరిగణనలోకి తీసుకుని డీకే అరుణకు ఛాన్స్ ఇస్తారా? లేక ముందే ఇచ్చిన మాట ప్రకారం బీసీ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని ఈటల రాజేందర్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటారా? అనేది మోదీ తుది నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు