జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో జరిగిన ఓ దారుణ ఘటన తీవ్ర కలకలం రేపింది. మూడేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారాన్ని పోలీసులకు తెలియకుండా గ్రామ పంచాయతీ పెద్దలు కప్పిపుచ్చేందుకు ప్రయత్నించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. అంతేకాకుండా, నిందితుడి నుంచి వసూలు చేసిన జరిమానా డబ్బుతో మాంసం, మద్యం ఏర్పాటు చేసి విందు చేసుకోవడం స్థానికులను ఆగ్రహానికి గురిచేసింది.
ఘాఘ్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన సునీల్ లోహ్రా గత శనివారం సాయంత్రం బాధిత చిన్నారి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో బాలిక తల్లి ఇంటి పనుల్లో ఉండగా, చిన్నారిని తాను చూసుకుంటానని చెప్పి నమ్మించాడు. తర్వాత ఇంట్లోని ఓ గదిలోకి తీసుకెళ్లి చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత చిన్నారి తీవ్రంగా ఏడుస్తూ బయటకు రావడంతో తల్లికి అనుమానం వచ్చింది. వెంటనే ఆమెను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యుల పరీక్షల్లో చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు తెలిసింది.
దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. అయితే గ్రామ పంచాయతీ పెద్దలు జోక్యం చేసుకుని విషయం బయటకు వెళ్లకుండా గ్రామంలోనే పరిష్కరించాలని ఒత్తిడి తెచ్చారు. మరుసటి రోజు పంచాయతీ నిర్వహించి నిందితుడికి రూ.1 లక్ష జరిమానా విధించారు. అందులో భాగంగా అతడు వెంటనే రూ.20 వేల రూపాయలు చెల్లించగా, మిగిలిన మొత్తం వారం రోజుల్లో ఇవ్వాలని నిర్ణయించారు.
అయితే ఆ డబ్బును బాధిత కుటుంబానికి అందించకుండా, పంచాయతీ పెద్దలు మాంసం, మద్యం ఏర్పాటు చేసి విందు చేసుకున్నారు. ఈ విషయం గ్రామస్థుల ద్వారా పోలీసులకు చేరడంతో ఘాఘ్రా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మోహన్ కుమార్ సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితిని పరిశీలించిన అనంతరం బాధిత చిన్నారి తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. నిందితుడు సునీల్ లోహ్రాను అరెస్టు చేసి, ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన పంచాయతీ పెద్దలపై కూడా చర్యలు ప్రారంభించారు.
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారికి న్యాయం చేయాల్సిన సమయంలో నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నించడం, బాధితురాలికి చేరాల్సిన డబ్బుతో విందు చేసుకోవడం అమానుషమని మండిపడుతున్నారు. బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.