Homeతెలంగాణమ‌హిళా సంఘాల‌ను కోటీశ్వ‌రుల‌ని చేయ‌డ‌మే ల‌క్ష్యం...సీఎం రేవంత్ కీల‌క నిర్ణ‌యం...!

మ‌హిళా సంఘాల‌ను కోటీశ్వ‌రుల‌ని చేయ‌డ‌మే ల‌క్ష్యం…సీఎం రేవంత్ కీల‌క నిర్ణ‌యం…!

హైదరాబాద్, క్రైమ్ మిర్ర‌ర్‌: రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు భారీ స్థాయిలో వ్యాపార అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల కోసం నిర్మించనున్న 8 వేల ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుంచి ముఖ్యమంత్రి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మహిళల ఆర్థికాభివృద్ధి కోసం పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. మహిళా సంఘాలు వ్యాపార రంగంలో మరింతగా రాణించేందుకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సంస్థల స్థాయిలో,ఇందిరా మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. తొలి విడతగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గ కేంద్రాల్లో అవసరమైన స్థలాలను గుర్తించి మహిళా సంఘాలకు స్వల్ప అద్దె ప్రాతిపదికన 30 ఏళ్లపాటు లీజుకు ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తూ, సూపర్ బజార్ల కోసం అవసరమైన భూములను గుర్తించడంపై దృష్టి సారించాలని సీఎం పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రారంభ నిధులు అందిస్తుందని,మహిళలు కూడా భాగస్వామ్య పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. మహిళలు ప్రస్తుతం పెద్ద ఎత్తున చైన్ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్లు చేస్తున్న నేపథ్యంలో, నాణ్యమైన నిత్యావసర వస్తువులు లభించే విశ్వసనీయ గుర్తింపుగా మహిళా శక్తి బజార్లను తీర్చిదిద్దాలని సీఎం ఆకాంక్షించారు.

దేశంలోనే అత్యుత్తమ సూపర్ బజార్లుగా ఇవి ఎదగాలని ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
ఇక ప్రతి మండలంలో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు, సరుకు రవాణా కేంద్రాలు, భారీ గిడ్డంగులు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఇందుకు అవసరమైన స్థలాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యతగా తీసుకుంటామని, బ్యాంకుల ద్వారా సున్నా వడ్డీ రుణాల అనుసంధానం కల్పిస్తామని స్పష్టం చేశారు. కొంతమంది మిల్లర్లు, దళారులు ప్రభుత్వ వ్యవస్థను మోసం చేస్తున్నారని పేర్కొన్న సీఎం, మహిళలకు బాధ్యతలు అప్పగిస్తే జవాబుదారీతనం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.

భవిష్యత్‌లో మండలాల వారీగా పెద్ద గిడ్డంగులు నిర్మించి ధాన్యాన్ని అక్కడే భద్రపరచే విధానం తీసుకురావాలని, మిల్లర్లు మహిళా సంఘాల నుంచే ధాన్యం సేకరించే వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళలు అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని సీఎం అన్నారు. మహిళలను స్వశక్తిపై నిలబెట్టేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క,మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు,ధనసరి అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మహిళలకు అందించనున్న ఇందిరమ్మ చీరల నమూనాలను కూడా సీఎం ఈ సందర్భంగా విడుదల చేశారు. 2034 నాటికి రాష్ట్రంలోని కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న మహత్తర లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, మహిళలందరినీ సొంత సోదరీమణులుగా భావిస్తూ రాష్ట్ర మంత్రిమండలి పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు