ముంబై, క్రైమ్ మిర్రర్: ముంబై హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు భార్యాభర్తల బాధ్యతలు, వైవాహిక సంబంధాలపై కొత్త చర్చకు దారితీసింది. భార్య ఇంట్లో వంట చేయలేదని, ఇంటి పనులు సరిగ్గా చేయడం లేదని ఆమెకు విడాకులు ఇవ్వడం సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది. వివాహం అనేది ఇద్దరు సమాన వ్యక్తుల మధ్య భాగస్వామ్యం మాత్రమే తప్ప, అది ఒక సర్వీస్ కాంట్రాక్ట్ కాదు. భార్యలు ఇంట్లో పనిమనుషులు కారు అని న్యాయమూర్తులు జస్టిస్ భారతి డాంగ్రే, జస్టిస్ మంజుషా దేశ్‌పాండే ధర్మాసనం తేల్చిచెప్పింది.వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ (CA) అయిన ఒక వ్యక్తి, తన భార్య ఇంటి పనులు చేయడం లేదని, తన తల్లిదండ్రులకు విధేయత చూపడం లేదని, ఆమె ప్రవర్తన వల్ల తాను మానసిక వేదనకు గురవుతున్నానని పేర్కొంటూ 2004లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
దీనిపై 2010లో ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేస్తూ, భార్యకు భరణం నిరాకరించింది. అయితే, దీనిని సవాలు చేస్తూ భార్య హైకోర్టును ఆశ్రయించగా, తాజాగా ఆమెకు అనుకూలంగా తీర్పు వెలువడింది.భార్య ఇంటి పనులు చేయకపోవడం అనేది మానసిక వేధింపుల కిందకు రాదని కోర్టు అభిప్రాయపడింది. ప్రతి వివాహంలోనూ ప్రారంభ దశలో చిన్నచిన్న సర్దుబాట్లు, మనస్పర్థలు ఉండటం సహజమని, వాటిని తీవ్రమైన క్రూరత్వంగా పరిగణించలేమని న్యాయమూర్తులు పేర్కొన్నారు. కేవలం వంట చేయడం, క్లీనింగ్ వంటి పనుల ఆధారంగా విడాకులు ఇవ్వడం చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేస్తూ, పాత విడాకుల ఉత్తర్వులను రద్దు చేసింది.
ఇక భరణం విషయంలో కూడా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సదరు భార్య గతంలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ క్లాసుల కోసం ప్రకటన ఇచ్చిందని, అది ఆమెకు స్థిరమైన ఆదాయం చూపుతుందని ఫ్యామిలీ కోర్టు భరణాన్ని నిరాకరించింది. దీనిని తప్పుపట్టిన హైకోర్టు.. కేవలం ఒక ప్రకటన లేదా చిన్నపాటి నైపుణ్యం ఉండటం వల్ల అది స్థిరమైన జీవనోపాధి కిందకు రాదని పేర్కొంది. భర్తకు ఉన్న ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి, ఆమెకు నెలకు రూ. 10,000 భరణం, నివాసం కోసం మరో రూ. 10,000 చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పు భవిష్యత్తులో విడాకుల కేసులపై పెద్ద ప్రభావం చూపనుంది.
ముఖ్యంగా సామాజికంగా భార్యలపై ఉండే ఇంటి పని’ ఒత్తిడిని చట్టపరమైన బాధ్యతగా చూడకూడదనే స్పష్టతనిచ్చింది. కేవలం మూస పద్ధతులతో భార్యపై ఆరోపణలు చేసి విడాకులు పొందడం ఇకపై అంత సులభం కాదని ఈ తీర్పుతో అర్థమవుతోంది.