-
క్రైమ్ మిర్రర్ కథనానికి స్పందన
-
మర్రిగూడలో ఖాకీ అరాచకాలకు చెక్..
-
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌కు ప్రజల నీరాజనాలు.
-
క్రైమ్ మిర్రర్ పత్రికకు కృతజ్ఞతలు!.
నల్గొండ నిఘా ప్రతినిధి (క్రైమ్ మిర్రర్) :- మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొంతకాలంగా సాగుతున్న అక్రమాలు, అవినీతి, సామాన్య ప్రజలపై సాగించిన ఖాకీ అరాచకాలపై, ఉన్నతాధికారులు ఎట్టకేలకు కొరడా ఝుళిపించారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి, రక్షణ కవచంలా నిలవాల్సిన పోలీస్ వ్యవస్థకే మాయని మచ్చగా మారిన సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) మునుగాల కృష్ణారెడ్డిపై, నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ, ఆయన్ను విఆర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం శుభపరిణామం. ఈ సాహసోపేతమైన ప్రజానుకూల నిర్ణయం పట్ల మర్రిగూడ మండల ప్రజలు, ఆదివారం స్థానిక చౌరస్తాలో బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకుంటూ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించి తమకు న్యాయం చేసిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చిత్రపటానికి, పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతాభావాన్ని చాటుకున్నారు.
-
పత్రికా స్వేచ్ఛకు దక్కిన విజయం ‘క్రైమ్ మిర్రర్’కు అభినందనలు
ఈ మొత్తం వ్యవహారంలో మర్రిగూడ పోలీస్ స్టేషన్లో జరుగుతున్న, అవినీతి అక్రమాలను, అరాచకాలను సాక్ష్యాధారాలతో సహా నిరంతరం వెలికితీసిన ‘క్రైమ్ మిర్రర్’ దినపత్రిక పాత్ర అత్యంత ప్రశంసనీయమని ప్రజలు అన్నారు. “మర్రిగూడలో గాడి తప్పిన లా అండ్ ఆర్డర్” “బాధితులపైనే అక్రమ కేసులు.. రక్షణ కవచమా? రాక్షసత్వమా?” అంటూ ‘క్రైమ్ మిర్రర్’ ప్రచురించిన వరుస సంచలన కథనాలు, మండలంలో తీవ్ర సంచలనం సృష్టించాయి. వెంకేపల్లి తండాకు చెందిన గిరిజన యువకులను అక్రమంగా కేసుల్లో ఇరికించడం, పేకాట శిభిరాల నిర్వాహకుల నుండి ముడుపులు స్వీకరించడం, హోటల్ ఫుడ్ బిల్లులు సైతం బాధితులతో కట్టించడం వంటి దారుణాలను ‘క్రైమ్ మిర్రర్’ సమాజం ముందుకు తెచ్చింది. పాలకుల, ఉన్నతాధికారుల కళ్లు తెరిపించేలా, బాధితుల పక్షాన నిలిచి నిఖార్సైన జర్నలిజానికి నిదర్శనంగా నిలిచిన ‘క్రైమ్ మిర్రర్’ పత్రికకు, ప్రతినిధులకు మండల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
-
బాధితులపై అక్రమ కేసులు – ప్రజాప్రతినిధుల ఆగ్రహం
గతంలో ఎస్ఐ కృష్ణారెడ్డి బాధితుల పక్షాన నిలిచిన, 15 మంది అమాయక గిరిజన యువకులపై అక్రమ కేసులు బనాయించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఖాకీ అరాచకాలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో బాధితులను వేధించే అధికారులకు తావులేదని, సదరు అధికారిని తక్షణమే విధుల నుండి తొలగించాలని, జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి వివరించారు. ‘క్రైమ్ మిర్రర్’ రాసిన కథనాలు, ప్రజా ప్రతినిధుల ఒత్తిడి, ప్రజల నుండి వ్యక్తమైన తీవ్ర నిరసనలతో స్పందించిన ఎస్పీ పవార్, తక్షణ చర్యలు చేపట్టారు.
-
ప్రజా రక్షకుడిగా నిలిచిన ఎస్పీ శరత్ చంద్ర పవార్
మర్రిగూడ మండల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి, శాంతిభద్రతలను భ్రష్టుపట్టించిన ఎస్ఐపై, చర్యలు తీసుకోవడం ద్వారా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సామాన్య ప్రజల్లో పోలీస్ వ్యవస్థపై పోయిన నమ్మకాన్ని పునరుద్ధరించారు. నిరుపేదల ఆవేదనను గుర్తించి, అవినీతికి తావులేకుండా ఆర్డర్ పాస్ చేసిన, ఎస్పీ పవార్ నిర్ణయాన్ని కొనియాడుతూ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా చౌరస్తాలో భారీగా బాణాసంచా కాల్చి, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ, ఎస్పీ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. మిర్యాలగూడ టూ టౌన్ నుండి నూతన ఎస్ఐగా నియమితులైన, రాంబాబు ఆధ్వర్యంలోనైనా మర్రిగూడలో శాంతిభద్రతలు తిరిగి అదుపులోకి వస్తాయని, అక్రమ దందాలకు, మాఫియాలకు అడ్డుకట్ట పడుతుందని సామాన్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అమాయకులకు అండగా నిలిచిన ‘క్రైమ్ మిర్రర్’ పత్రికకు, న్యాయాన్ని కాపాడిన ఎస్పీకి మర్రిగూడ ఎప్పటికీ రుణపడి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దామెర భీమనపల్లి మాజీ ఎంపీటీసీ సిలివేరు విష్ణు, కెవి గౌడ్, అచ్చిని సైదులు, నడిమింటి శీను, మాదగోని మహేష్ గౌడ్, నాగిళ్ళ మారయ్య, సిరగోని వెంకటేష్, నడిమింటి రవి, గోరిగే రమేష్, పంతంగి సాయి కుమార్, అచ్చిని బాలరాజు, అంబళ్ల వెంకటయ్య, ఇస్తారీ తదితర ముఖ్య నాయకులు, మండల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.