హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: నాగ చైతన్య, దర్శకుడు కార్తీక్ వర్మ దండు కాంబినేషన్లో తెరకెక్కుతున్న వృషకర్మపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. మిథికల్ ఫాంటసీ, యాక్షన్, అడ్వెంచర్ అంశాలను కలిపి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వృషకర్మ చిత్రబృందం విశాఖపట్నంలోని గ్లాస్ బ్రిడ్జ్ వద్ద ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించింది. నాగ చైతన్య, మీనాక్షి చౌదరి, సత్య, జయరామ్, దర్శకుడు కార్తీక్ దండు, నిర్మాతలు, ఇతర టీమ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. త్రివర్ణ పతాకాలు, బెలూన్లతో వేడుకల్లో సందడి చేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకుంటూ చిత్రబృందం నివాళులు అర్పించింది. ప్రస్తుతం సినిమా షూటింగ్ వైజాగ్ పరిసరాల్లో జరుగుతున్నట్లు ఈ వేడుకలకు సంబంధించిన వీడియోల ద్వారా తెలుస్తోంది.
Also Read:త్రిష సంచలన పోస్ట్.. ‘ఇంత నాటకం సిగ్గుచేటు’ అంటూ షాకింగ్ కామెంట్స్
మరోవైపు వృషకర్మ విడుదల తేదీపై దర్శకుడు కార్తీక్ దండు ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. అయితే సినిమాకు సంబంధించిన విజువల్ ఎఫెక్ట్స్ పనులు కీలకం కావడంతో తొందరపడి విడుదల చేయబోమని స్పష్టం చేశారు. గ్రాఫిక్స్ పనులు అనుకున్న సమయానికి పూర్తయితే దసరా రిలీజ్‌కు దాదాపు 90 శాతం అవకాశం ఉందని, సాధ్యం కాకపోతే డిసెంబర్లో విడుదల చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. వృషకర్మ కథ, స్క్రీన్‌ప్లే కొత్త అనుభూతిని అందించేలా ఉంటాయని దర్శకుడు చెబుతున్నారు. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరో ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొన్నారు. నాగ చైతన్య ఇందులో ఇప్పటివరకు చేయని తరహా పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ట్రెజర్ హంటర్‌గా ఆయన పాత్ర సాగనుండగా, ఫాంటసీతో పాటు భారీ యాక్షన్, అడ్వెంచర్ సన్నివేశాలు కథలో కీలకంగా ఉండనున్నాయి.
Also Read:RC17లో రామ్ చరణ్ సరికొత్త లుక్.. 15 కిలోలు తగ్గనున్న మెగా పవర్ స్టార్?
లాపతా లేడీస్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న స్పర్శ్ శ్రీవాస్తవ వృషకర్మతో టాలీవుడ్లో ప్రతినాయకుడిగా పరిచయం కానున్నారు. దీంతో హీరో, విలన్ పాత్రల మధ్య సంఘర్షణ ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ఇతర ప్రచార కంటెంట్‌లోని విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచాయి. మరోవైపు ఈ సినిమాకు బిజినెస్ పరంగానూ మంచి స్పందన లభిస్తున్నట్లు సమాచారం. థియేట్రికల్ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్, ఓటీటీ హక్కులను జీ5 దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది
