Homeఅంతర్జాతీయం31 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలకు తెగించి పోరాటం.. భారత పైలట్‌కు ప్రపంచ నేతల ప్రశంసలు

31 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలకు తెగించి పోరాటం.. భారత పైలట్‌కు ప్రపంచ నేతల ప్రశంసలు

ఆకాశంలో పెను ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో కోపైలట్ కత్తితో దాడి చేసినప్పటికీ.. తీవ్రంగా గాయపడిన మచ్చర్ పరిస్థితిని ఎదుర్కొని వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు పోరాడారు. ఆయన ధైర్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా మచ్చర్ సాహసాన్ని ప్రశంసించారు.

ఫ్లైదుబాయ్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం బుధవారం ఉదయం దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు బయలుదేరింది. విమానంలో మొత్తం 174 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 166 మంది ఇజ్రాయెల్ పౌరులు ఉన్నట్లు సమాచారం.

విమానం సుమారు 31 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో కాక్‌పిట్‌లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఒమన్‌కు చెందిన కోపైలట్ కత్తితో కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసినట్లు సమాచారం. విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన కోపైలట్‌ను మచ్చర్ తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ క్రమంలో ఆయన గాయపడినప్పటికీ వెనక్కి తగ్గకుండా పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు.

కాక్‌పిట్ నుంచి మచ్చర్ అరుపులు వినిపించడంతో విమాన సిబ్బంది, ప్రయాణికులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం కోపైలట్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో విమానం 31 వేల అడుగుల ఎత్తు నుంచి దాదాపు 14 వేల అడుగుల వరకు దిగిపోయింది. ప్రయాణికుల్లో ఉన్న ఇద్దరు పైలట్లు విమాన నియంత్రణను చేపట్టి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చారు. అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.

ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో మచ్చర్ ప్రదర్శించిన ధైర్యాన్ని ప్రశంసించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు ఆయన చేసిన పోరాటం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. మచ్చర్‌ను చూసి దేశం గర్విస్తోందని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా మచ్చర్ ధైర్యానికి సెల్యూట్ చేశారు. సమయానికి కాక్‌పిట్ తలుపు తెరుచుకోవడంతో విమాన సిబ్బంది, ప్రయాణికులు అక్కడికి చేరుకుని దుండగుడిని అదుపులోకి తీసుకోవడానికి అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు. మచ్చర్ పోరాటం కారణంగా భారీ ప్రమాదం తప్పిందని నెతన్యాహు ప్రశంసించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం మచ్చర్‌ను నిజమైన హీరోగా అభివర్ణిస్తూ ఆయన ధైర్యాన్ని కొనియాడారు.

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కూడా భారత పైలట్ సాహసాన్ని ప్రశంసించారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా 174 మంది ప్రయాణికుల భద్రత కోసం పోరాడిన మచ్చర్ ధైర్యం, సమయస్ఫూర్తి అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గాయపడినప్పటికీ ఇతరుల ప్రాణాలను కాపాడాలనే ఆయన సంకల్పం చెక్కుచెదరలేదని అన్నారు. ఆయన తక్షణ స్పందనతో ఎన్నో విలువైన ప్రాణాలు కాపాడబడ్డాయని పేర్కొంటూ.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ ఘటనలో కెప్టెన్ స్మిత్ మచ్చర్ ప్రదర్శించిన ధైర్యం, విమాన సిబ్బంది, ప్రయాణికుల సమయస్ఫూర్తి కారణంగా భారీ ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.

also read: రమా నందన సోషల్ మీడియా పోస్ట్ వైరల్.. ‘సెప్టెంబర్ 7న కఠిన పరిస్థితి ఎదుర్కొన్నా’ అంటూ సంచలన వ్యాఖ్యలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు