ఏలూరు జిల్లాలోని ఆగిరిపల్లి మండలం వడ్లమాను సమీపంలో గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సు ప్రమాదానికి గురై కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం.
ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన విద్యార్థులను, ఇతర క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
ఆగిరిపల్లి నుంచి నూజివీడు వైపు స్కూల్ బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మార్గమధ్యంలో ఓ ఆటోను ఓవర్‌టేక్ చేసే క్రమంలో బస్సు అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టినట్లు ప్రాథమిక సమాచారం. అనంతరం బస్సు అదుపు కోల్పోయి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది.
ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? లేక ఇతర పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.
also read: 31 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలకు తెగించి పోరాటం.. భారత పైలట్‌కు ప్రపంచ నేతల ప్రశంసలు
