బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌కు ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ 18వ సీజన్ షూటింగ్ సమయంలో గాయం కావడం చర్చనీయాంశంగా మారింది. మోకాలికి గాయం కావడంతో కొంత ఇబ్బంది ఎదురవుతోందని స్వయంగా అమితాబ్ వెల్లడించారు. దీంతో ఈసారి కార్యక్రమాన్ని కూర్చొని నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రేక్షకులకు తెలిపారు.
సాధారణంగా పోటీదారులను స్వాగతించే సమయంలో నిలబడే అమితాబ్.. ప్రస్తుతం మోకాలి గాయం కారణంగా అలా చేయలేకపోతున్నారని వివరించారు. అయితే దీనిపై అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తన సీటు వద్ద నుంచే లేచి నిలబడి పోటీదారులను ఆహ్వానిస్తానని చెప్పారు.
83 ఏళ్ల వయసులోనూ అమితాబ్ బచ్చన్ వరుస ప్రాజెక్టులతో బిజీగా కొనసాగుతున్నారు. ఒకవైపు ‘సెక్షన్ 84’ చిత్రంలో నటిస్తుండగా.. మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కల్కి’ సీక్వెల్ షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు.
ఇలా టెలివిజన్ కార్యక్రమంతో పాటు సినిమాల్లోనూ వరుసగా పనిచేస్తున్న అమితాబ్.. మోకాలి గాయం నేపథ్యంలో కొంత జాగ్రత్తగా షూటింగ్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యంపై అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్వయంగా చెప్పడం వారికి ఊరటనిచ్చే విషయంగా మారింది.
also read: ఏలూరులో ఘోర ప్రమాదం.. కాలువలోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు.. ఒకరు మృతి
