క్రైమ్ మిర్రర్ : లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద డిస్ట్రిక్ట్ టాస్క్‌ఫోర్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అధికారులు అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, వారి వద్ద సుమారు 23 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. గంజాయితో పట్టుబడిన వారిని ముంబైకి చెందిన రహ్మతుల్లా ఖాన్, రషీద్‌గా గుర్తించారు. వీరు ఒడిశాలో గంజాయిని కొనుగోలు చేసి, రైలుమార్గం ద్వారా హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ వద్ద గంజాయిని తరలిస్తున్న సమయంలో అధికారులు వారిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు.
నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సుమారు 23 కిలోల గంజాయిని సీజ్ చేసిన అధికారులు.. వారిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరికి సరఫరా చేసేందుకు తరలిస్తున్నారు, ఈ అక్రమ రవాణా వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
also read : కాంగ్రెస్ వ్యవస్థల రాజకీయం…!
