దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతున్న వేళ నైరుతి రుతుపవనాల కదలికలపై భారత వాతావరణ శాఖ కీలక సమాచారం వెల్లడించింది. ప్రస్తుతం చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు అండమాన్ ప్రాంతాలను దాటి అరేబియా సముద్రంలోకి ప్రవేశించినట్లు అధికారులు తెలిపారు. అండమాన్ పరిసర ప్రాంతాలపై రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తుండగా, ఆగ్నేయ అండమాన్‌తో పాటు మరికొన్ని ప్రాంతాలకు కూడా అవి వ్యాపించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే 3 నుంచి 4 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, నైరుతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ దీవులు, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మే 26న కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని అంచనా వేసింది. సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్ 1న భారత్‌లోకి ప్రవేశించే రుతుపవనాలు ఈసారి ముందుగానే దేశాన్ని తాకనున్నట్లు స్పష్టమవుతోంది.
గత ఏడాది కూడా రుతుపవనాల ప్రవేశంపై భారత వాతావరణ శాఖ చేసిన అంచనాల కంటే ముందుగానే అవి కేరళను తాకిన విషయం తెలిసిందే. 2025లో మే 27న రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేయగా, అవి మే 21కే కేరళలోకి ప్రవేశించాయి. ఈసారి కూడా మే 26 కంటే ముందుగానే కేరళను తాకే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం అత్యంత చురుగ్గా కదులుతుండటమే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే జూన్ తొలి వారంలోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతం, అండమాన్ సముద్ర ప్రాంతాల్లో ఇప్పటికే భారీగా మేఘాలు కమ్ముకున్నాయి. గత 2 రోజులుగా అండమాన్ దీవుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో సముద్ర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు నైరుతి రుతుపవనాల విస్తరణకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
ఇక మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత మాత్రం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శనివారం అనేక ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల దాకా నమోదయ్యాయి. 6 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. నిర్మల్ జిల్లా తానూరులో అత్యధికంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా భోరజ్‌లో 45.5 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లా భీంగల్‌లో 45.3 డిగ్రీలు, జగిత్యాల జిల్లా గోధూరులో 45.2 డిగ్రీలు నమోదయ్యాయి. అలాగే కామారెడ్డి జిల్లా ఏలుపుగొండ, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ప్రాంతాల్లో 45.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా విదర్భా పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. బీహార్ నుంచి తమిళనాడు వరకు జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ మీదుగా అంతర్ కర్ణాటక వరకూ ద్రోణి విస్తరించింది. దీని ప్రభావంతో ఈరోజు పార్వతీపురం మన్యం, అల్లూరి, పోలవరం, తూర్పుగోదావరి, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీవ్రమైన ఎండల మధ్య వర్షాల సూచన ప్రజలకు కొంత ఊరటనిచ్చే అవకాశముంది.
ALSO READ: పెట్రోల్ వాడకంలో ఇదే టాప్