పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌ను శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. రాత్రి ఆలస్యంగా చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ కేసులో రోజంతా ఉత్కంఠభరిత పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ప్రత్యేక బృందాలతో గాలింపు!
భగీరథ్‌కు ముందస్తు బెయిల్ విషయంలో హైకోర్టులో ఊరట లభించకపోవడంతో పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. ఉదయం నుంచే అతనిపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేసి, పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, కరీంనగర్‌లలోని పలు ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాసానికి కూడా పోలీసులు వెళ్లి తనిఖీలు చేశారు.
అప్పా జంక్షన్ సమీపంలో భగీరథ్ అరెస్ట్!
ఈ నేపథ్యంలో రాత్రి 8 గంటల సమయంలో బండి సంజయ్ ఒక ప్రకటన విడుదల చేశారు. చట్టంపై గౌరవంతో తన కుమారుడిని న్యాయవాదుల ద్వారా పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. కొద్దిసేపటికే సైబరాబాద్ పోలీసులు భగీరథ్‌ను అప్పా జంక్షన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నామని ప్రకటించారు. అనంతరం అతడిని పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌కు తీసుకెళ్లిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత మేడ్చల్ కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. రాత్రి 12 గంటల ప్రాంతంలో జైలుకు తరలించారు.
ఈ నెల 8 నుంచి పరారీలో భగీరథ్
ఈ కేసు ఈ నెల 8న నమోదైనప్పటి నుంచి భగీరథ్ పరారీలోనే ఉన్నాడు. అతని ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో పోలీసులు కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు కొనసాగించారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసుఫ్‌గూడ ప్రాంతాల్లో అతని స్నేహితులను కూడా విచారించారు. విదేశాలకు పారిపోయే అవకాశం ఉందనే అనుమానంతో లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు.
బాధితురాలి వాంగ్మూలం నమోదు
మరోవైపు ఈ కేసులో బాధితురాలి వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ఎదుట పోలీసులు నమోదు చేశారు. పోక్సో కేసుల్లో ఈ ప్రక్రియ కీలకంగా భావిస్తారు. అలాగే బాధితురాలిపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన 14 మంది యూట్యూబర్లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇంకా 27 మందిపై ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం.
అటు తన కుమారుడు తప్పు చేయలేదని చెబుతున్నప్పటికీ చట్టపరమైన ప్రక్రియకు సహకరించేందుకే పోలీసులకు అప్పగించినట్లు బండి సంజయ్ తెలిపారు.