Bindu Madhavi: తెలుగు బుల్లితెరపై కామెడీ కార్యక్రమాల గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చే షోలలో జబర్దస్త్ ఒకటి. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా పలువురు కమెడియన్లు స్టార్ స్థాయికి చేరుకున్నారు. ఒకప్పుడు సాధారణ కళాకారులుగా తమ ప్రయాణాన్ని ప్రారంభించిన సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్, బలగం వేణు, ధనాధన్ ధన్‌రాజ్, అదిరే అభి వంటి వారు ప్రస్తుతం సినీ రంగంలో బిజీగా కొనసాగుతున్నారు. కాలక్రమేణా ఈ కార్యక్రమానికి ఉన్న ఆదరణ కొంత తగ్గినా, ఇప్పటికీ భారీ సంఖ్యలో ప్రేక్షకులు ఈ కామెడీ షోను క్రమం తప్పకుండా వీక్షిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంపై వినోదంతో పాటు విమర్శలు కూడా తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా డబుల్ మీనింగ్ సంభాషణలు, కొన్ని సందర్భాల్లో మహిళలను కించపరిచేలా ఉండే హాస్య ప్రదర్శనలపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తుంటారు.

ఇలాంటి సమయంలో ప్రముఖ నటి, బిగ్ బాస్ విజేత బిందు మాధవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతం ఆమె ఓ ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌లో ప్రసారమవుతున్న మాస్ జాతర అనే కామెడీ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బిందు మాధవి, టెలివిజన్ కామెడీ షోలలో వస్తున్న కంటెంట్ గురించి తన అభిప్రాయాలను వెల్లడించింది. ఆమె నేరుగా జబర్దస్త్ పేరు ప్రస్తావించకపోయినా, చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆ కార్యక్రమానికే సంబంధించినవిగా నెటిజన్లు భావిస్తున్నారు.
మాస్ జాతర పూర్తిగా వినోదంతో నిండిన కార్యక్రమమని చెప్పిన బిందు మాధవి, మొదట తనకు న్యాయనిర్ణేతగా అవకాశం వచ్చినప్పుడు వెంటనే అంగీకరించలేదని తెలిపింది. ప్రస్తుతం చాలా కామెడీ కార్యక్రమాల్లో డబుల్ మీనింగ్ సంభాషణలు, అసభ్యకరమైన హాస్యం ఎక్కువగా కనిపిస్తోందని, అలాంటి వాతావరణంలో తాను సౌకర్యంగా ఉండలేననే భావన కలిగిందని వెల్లడించింది. అదే విషయాన్ని కార్యక్రమ దర్శకుడికి కూడా స్పష్టంగా చెప్పానని ఆమె పేర్కొంది. అయితే దర్శకుడు ప్రత్యేకంగా వచ్చి కార్యక్రమం గురించి పూర్తి వివరణ ఇచ్చాడని, తమ కార్యక్రమంలో అసభ్యతకు ఎలాంటి స్థానం ఉండదని హామీ ఇచ్చిన తర్వాతే తాను అంగీకరించానని చెప్పింది.
కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చొని చూసేలా స్వచ్ఛమైన హాస్యాన్ని అందించడమే తమ లక్ష్యమని దర్శకుడు చెప్పాడని బిందు మాధవి తెలిపింది. ఎక్కడైనా అసౌకర్యంగా అనిపిస్తే కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోవచ్చని కూడా తనకు చెప్పారని వెల్లడించింది. ఆ నమ్మకంతోనే తాను మాస్ జాతరలో భాగమయ్యానని పేర్కొంది. ప్రస్తుతం బిందు మాధవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. కొందరు ఆమె అభిప్రాయాలకు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు కామెడీని కామెడీగానే చూడాలని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా బిందు మాధవి వ్యాఖ్యలు మరోసారి తెలుగు కామెడీ కార్యక్రమాల కంటెంట్‌పై పెద్ద చర్చకు దారితీశాయి.
ALSO READ: ప్రయాగ్‌రాజ్‌లా మారిన కాళేశ్వరం.. పుష్కరాలకు భారీ ఏర్పాట్లు