-
స్పష్టతనిచ్చిన నీతి ఆయోగ్
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: అమరావతి రాజధాని లో నిర్మాణ పనులు నిలిపివేస్తారా? ఎక్కడివక్కడే పనులు నిలిచిపోతాయా? ఈ మేరకు నీతి ఆయోగ్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించిందా? పొలిటికల్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత? ఇప్పుడు అంతటా దీనిపైనే చర్చ నడుస్తోంది. దీనిపై నీతి ఆయోగ్ సైతం స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది.
నీతి ఆయోగ్ సిఫార్సులంటూ…
పశ్చిమ ఆసియా యుద్ధ పరిస్థితుల ప్రభావం కారణంగా రెండేళ్ల పాటు కొత్త నిర్మాణాలు నిలిపివేయాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. దేశవ్యాప్తంగా ఈ ప్రచారంపై చర్చ జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఏపీలో ఈ వార్తను సాకుగా చూపుతూ అమరావతి రాజధాని నిర్మాణం కూడా ఆగిపోతుందంటూ.. కొంతమంది సోషల్ మీడియా వేదికగా ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ స్పందించింది. అటువంటి సూచనలేవి ఏపీకి చేయలేదని స్పష్టతనిచ్చింది. దీంతో ఈ దుష్ప్రచారానికి తెరపడింది. సాధారణంగా అమరావతి వ్యతిరేకులు అంటే ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిలుస్తుంది. ఆ ప్రచారం వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందన్నది బహిరంగ రహస్యం.
యుద్ధం నేపథ్యంలో…
దేశంలో పొదుపు మంత్రం పఠిస్తున్న వేళ.. రకరకాల ప్రచారం జరుగుతోంది. ఇంధన పొదుపుపై ప్రధాని నరేంద్ర మోడీ సైతం కీలక ప్రతిపాదనలు చేశారు. మరోవైపు నిర్మాణరంగంపై కూడా యుద్ధ ప్రభావం ఉంది. అయితే ఒకవేళ భవిష్యత్తులో దేశీయంగా నిర్మాణరంగంపై ఏవైనా ఆంక్షలు వస్తే.. అమరావతి రాజధాని నిర్మాణానికి ఎటువంటి నష్టం ఉండదు. నిర్మాణాలు కూడా ఆగిపోవు. ఎందుకంటే ప్రభుత్వ నిధుల పైనే అమరావతి నిర్మాణం ఆధారపడడం లేదు. ప్రపంచ బ్యాంకు తో పాటు ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంకు భారీగా ఆర్థిక సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకసారి అంతర్జాతీయ ఒప్పందాలు జరిగితే నిలిచిపోవు. అమరావతి లాంటి ప్రాజెక్టులకు నిధులు నిలిపివేసే ప్రసక్తి ఉండదు. అయితే ఈ విషయం తెలియక అమరావతి ఆగిపోతున్నట్లు ప్రచారం చేస్తున్న వారికి నీతి అయోగ్ షాక్ ఇచ్చింది.
సాధ్యమయ్యేది కాదు…
గత అనుభవాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం సైతం ప్రత్యేక ఆదరణ చూపుతోంది. ఒకవేళ ఎటువంటి ఆంక్షలు ఉన్నా అమరావతికి మినహాయింపు ఉంటుంది. అమరావతి అంటే కేవలం రాజధాని మాత్రమే కాదు. ఐదు కోట్ల మంది ఆశలకు ప్రతీకగా నిలుస్తోంది. సెల్ఫ్ ఫైనాన్స్ నగరంగా కూడా అవతరించనుంది. భవిష్యత్తులో అమరావతి మిగులు భూముల ద్వారా లక్షల కోట్ల ఆదాయం సమకూరనుంది. అంటే అమరావతి అభివృద్ధికి అమరావతి దోహదపడనుందన్నమాట. ప్రపంచంలో ఏ సంక్షోభం వచ్చినా దానిని అమరావతి తో ముడిపెడుతూ ఆనందపడుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అమరావతి ఆగిపోతుందన్న ప్రచారం వెనుక కూడా ఆ పార్టీ ఉందన్న అనుమానం ప్రతి ఒక్కరిలో ఉంది. దానిని పట్టించుకునే స్థితిలో లేదు కూటమి ప్రభుత్వం.