Homeతెలంగాణరేవంత్ సర్కార్‌ను బొందపెడతాం.. కవిత సంచలన వ్యాఖ్యలు

రేవంత్ సర్కార్‌ను బొందపెడతాం.. కవిత సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు మహబూబ్‌నగర్ జిల్లా లక్ష్మీదేవిపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో అధికార కాంగ్రెస్.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. పాలమూరు గడ్డపై సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న జాప్యంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను పాలమూరు బిడ్డనని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో పాలమూరు ప్రజలు కాంగ్రెస్‌కు 12 సీట్లు కట్టబెడితే ఈ రెండున్నర ఏళ్ల కాలంలో ఒక్క తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదని ఎద్దేవా చేశారు. కృష్ణా నది నీళ్లు మన పొలాలకు రాకుండా చేస్తున్న ఈ ద్రోహానికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను కిలోమీటర్ లోతులో గొయ్యి తీసి బొందపెట్టడం ఖాయమని హెచ్చరించారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరుతో 33 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందలేదని అధ్యక్షురాలు ఆరోపించారు. కృష్ణా నది నుంచి నీటిని మళ్లించే విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాల వల్లే నేడు ఈ దుస్థితి ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో జూరాల నుంచి నీళ్లు తీసుకోవడానికి జీవో 72 ఉండగా తెలంగాణ వచ్చాక దానిని కావాలనే శ్రీశైలంకు మార్చారని విమర్శించారు. శ్రీశైలం వద్ద అప్రోచ్ ఛానల్ వెడల్పును 140 మీటర్ల నుంచి 50 మీటర్లకు తగ్గించి కాంట్రాక్టర్లకు మేలు చేశారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో ప్రజా ధనాన్ని వృథా చేశారని మండిపడ్డారు.

విద్య.. వైద్య రంగాల్లో ప్రజలకు అండగా ఉంటామని ఆమె ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల భారం నుంచి పేదలను రక్షించేందుకు ప్రభుత్వం ద్వారానే ఫీజులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎటువంటి అనారోగ్యం వచ్చినా రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తుందని భరోసా ఇచ్చారు. యువత సొంతంగా వ్యాపారాలు చేసుకునేందుకు 2 లక్షల నుంచి 20 కోట్ల రూపాయల వరకు నేరుగా ప్రభుత్వ రుణ సదుపాయం కల్పిస్తామని ప్రకటించారు. నిరుద్యోగ సమస్య పరిష్కారమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.

వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి 3 వేల ఎకరాలకు ఒక లష్కర్‌ను నియమించి సాగునీటి నిర్వహణను మెరుగుపరుస్తామని వివరించారు. రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా చేయడమే తమ ఆశయమని తెలిపారు. కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటాను దక్కించుకోవడంలో కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. పాలమూరు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి తెలంగాణ రక్షణ సేన నిరంతరం పోరాడుతుందని పిలుపునిచ్చారు. ఈ సభకు భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మార్పు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ALSO READ: ఉద్యోగుల కష్టాలకు చెక్.. పీఎఫ్‌ విత్‌డ్రాలో భారీ మార్పులు…! ఇక ఏటీఎం, యుపీఐ ద్వారా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు