క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: పదవీ విరమణ చేసిన అధికారులను సలహాదారులుగా నియమించడాన్ని తాము అడ్డుకోలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. రిటైర్డ్ అధికారులను సలహాదారులుగా లేదా ప్రత్యేక విధుల అధికారులు (OSDs)గా నియమించుకోవడం అనేది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, అటువంటి విషయాల్లో న్యాయస్థానాలు సాధారణంగా జోక్యం చేసుకోలేవని జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి పేర్కొన్నారు.
మాజీ డీజీపీ బి. శివధర్‌రెడ్డిని రాష్ట్ర భద్రతా సలహాదారుగా నియమిస్తూ జారీ చేసిన జీవో 1339పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. సామాజిక కార్యకర్త టి. ధనగోపాల్ రావు ఈ నియామకాన్ని సవాలు చేస్తూ పిటిషన్ వేశారు. ప్రకాశ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు ఇది విరుద్ధమని ఆయన వాదించారు. ఈ నియామకంపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించిన కోర్టు, ప్రధాన పిటిషన్‌పై విచారణను జూన్ 25, 2026కు వాయిదా వేసింది.