నంద్యాల, క్రైమ్ మిర్రర్: ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి, వేగవంతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం నుండి టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా రెవెన్యూ సంబంధిత సమస్యలను గ్రామస్థాయిలోనే త్వరితగతిన పరిష్కరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా “వన్ మంత్ – వన్ విలేజ్ – ఫోర్ విజిట్స్” కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కింద ప్రతి గురువారం రోజున ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, అదే గ్రామాన్ని నెలలో నాలుగు వారాల పాటు అధికారులు సందర్శించాలని కలెక్టర్ సూచించారు. ఈ బృందంలో తహసీల్దార్, ఎంపీడీఓ, వీఆర్‌ఓ, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, మండల సర్వేయర్, పంచాయతీరాజ్ విభాగం ఏఈ, సాగునీటి శాఖ అధికారులు, అవసరమైతే అటవీ శాఖ అధికారులు పాల్గొని గ్రామాల్లో సమస్యలను గుర్తించి పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రజలకు తక్షణ సేవలు అందించడం, పెండింగ్ ఫిర్యాదులను తగ్గించడం, వివాదరహిత గ్రామాల నిర్మాణం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి మండలంలో ప్రతి నెల ఒక రెవెన్యూ గ్రామాన్ని ఎంపిక చేసి నాలుగు విడతలుగా కార్యక్రమాన్ని అమలు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. మొదటి విడతలో గ్రామంలో ఫిర్యాదుల స్వీకరణ, రికార్డుల ప్రదర్శన, సాధారణ సమస్యల పరిష్కారం చేపట్టాలి. రెండో విడతలో ఫీల్డ్ స్థాయి పరిశీలనలు నిర్వహించి వినతులపై విచారణ చేయాలి. మూడో విడతలో సమస్యల పరిష్కారం, ఆదేశాల జారీ, మ్యూటేషన్లు వంటి చర్యలు తీసుకోవాలి. నాలుగో విడతలో గ్రామ సభ నిర్వహించి పరిష్కరించిన అంశాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు.
భూమి హక్కుల నమోదు (ROR), వెబ్‌ల్యాండ్ సమస్యలు, సర్వే నంబర్లలో పొరపాట్లు, సరిహద్దు వివాదాలు, మార్గ హక్కుల సమస్యలు, కుటుంబ భూ వివాదాలు, ఆక్రమణలు, ఖాతా మార్పిడి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అందిన అన్ని ఫిర్యాదులను పీజీఆర్‌ఎస్‌లో నమోదు చేసి, సమయపాలనతో పరిష్కరించాల్సిందిగా సూచించారు. శాఖల మధ్య సమన్వయంతో గ్రామస్థాయిలోనే సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేయాలని, ప్రతి వారం కార్యక్రమ పురోగతిని స్వయంగా సమీక్షిస్తానని కలెక్టర్ తెలిపారు. పీజీఆర్‌ఎస్ ద్వారా ఫిర్యాదుల నమోదు, పరిష్కారాన్ని ట్రాక్ చేస్తూ పారదర్శకతను మరింత పెంచుతామని పేర్కొన్నారు. మే 2026 నుండి ప్రతి నెల మొదటి నుండి నాలుగవ గురువారాల వరకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ, ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని బలోపేతం చేయడమే లక్ష్యమని తెలిపారు. నిరంతర పర్యవేక్షణతో పారదర్శక పాలన అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని స్పష్టం చేశారు