రూ. వెయ్యి కోట్లతో శంఖు స్థాపన
శ్రీసిటీ, క్రైమ్ మిర్రర్: ప్రపంచ ప్రఖ్యాత క్యారియర్ గ్లోబల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ అండ్ రెఫ్రిజిరేషన్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో నూతన తయారీ కేంద్ర నిర్మాణాన్ని బుధవారం ప్రారంభించింది. ఇది దక్షిణ భారతదేశంలో క్యారియర్‌కు తొలి తయారీ యూనిట్ కానుంది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, మానవ వనరుల శాఖ నారా లోకేష్ ముఖ్య అతిధిగా ఈ కంపెనీ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, క్యారియర్ గ్లోబల్ యాజమాన్య ప్రతినిధులు డేవిడ్ ఎల్ గిట్లిన్, మైఖేల్ ఎల్ గియర్జెస్, సుందరేశన్ నారాయణన్, శ్రీసిటీ ప్రతినిధులు శ్రీని రాజు, డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు హాజరయ్యారు.
ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ భారతదేశంలోని అత్యంత చురుకైన పారిశ్రామిక ఎకోసిస్టమ్‌లలో ఒకటైన శ్రీసిటీలో నేడు ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొనడం గౌరవంగా ఉందన్నారు. ఈ రోజు కేవలం ఒక ప్రాజెక్టును ప్రారంభించడం మాత్రమే కాదు, భారతదేశ డిజిటల్ మరియు ఏఐ అభివృద్ధి యొక్క తదుపరి అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. క్యారియర్ సంస్థ నాయకత్వానికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి, క్యారియర్ కేవలం ఒక కంపెనీ కాదు, ప్రపంచం శీతలీకరణ ఆలోచన విధానాన్ని మార్చిన పయనీర్ సంస్థగా అభివర్ణించారు.
“నా మొదటి ఎయిర్ కండిషనర్ కూడా క్యారియర్‌దే. కాబట్టి ఇది కేవలం వ్యాపార సంబంధం కాదు, ప్రత్యేకమైన అనుబంధం. మోడ్రన్ ఎయిర్ కండిషనింగ్‌ను కనిపెట్టడం నుండి $50 బిలియన్ గ్లోబల్ సంస్థగా ఎదగడం వరకు క్యారియర్ ఎప్పుడూ ఆవిష్కరణలో ముందంజలో ఉంది. ఇప్పుడు ఆ ఆవిష్కరణ మన రాష్ట్రానికి వస్తోంది. దీని ద్వారా ₹1000 కోట్ల పెట్టుబడి సుమారు 3,000 స్థానిక ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఇది మన రాష్ట్రం, మన ఎకోసిస్టమ్ మరియు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంపై నమ్మకానికి నిదర్శనం” అని మంత్రి వ్యాఖ్యానించారు.