టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ ఒక 420 అని.. వారిది దొంగల బ్యాచ్ అని అభివర్ణించారు. గత ప్రభుత్వ హయాంలో పాస్‌పోర్ట్ కుంభకోణం నుంచి భూముల అక్రమాల వరకు అన్నింటిలో కేటీఆర్ కుటుంబం హస్తం ఉందని ఆరోపించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలను విమర్శించే స్థాయి కేటీఆర్‌కు లేదని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో దొంగచాటుగా వచ్చి చేరిన కేటీఆర్.. ఉద్యమకారుడు కేకే మహేందర్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీశారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఒకే కుటుంబంలో ఉన్న వారందరికీ పదవులు ఇచ్చుకుంటూ యువతను మద్యానికి బానిసలుగా మార్చి రాష్ట్ర భవిష్యత్తును బీఆర్ఎస్ సర్కార్ నాశనం చేసిందని మండిపడ్డారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని నాడు కేసీఆర్ ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ.. ఆ మాట నిలబెట్టుకోలేకపోయిన కేసీఆర్‌కు ఇప్పుడు తల ఉందా లేదా అని ఘాటుగా ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పాలనలో జరిగిన అరాచకాలను రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదని మహేష్ కుమార్ గౌడ్ గుర్తు చేశారు. మరోవైపు బీజేపీ నేత బండి సంజయ్ వైఖరిని కూడా ఆయన తప్పుపట్టారు. సంజయ్ ఒక పిట్టల దొరలా మాట్లాడుతున్నారని.. విచారణ సంస్థల వద్ద ఉన్న కేసుల విషయంలో ఆరు నెలలుగా ఏం చేస్తున్నారని నిలదీశారు. తెలంగాణను దోచుకున్న వారిపై చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యాన్ని ఆయన ఎండగట్టారు.
ALSO READ: ఏపీలో టీవీకె.?! విజయ్ పార్టీ విస్తరణ…తెర వెనుక కాంగ్రెస్