Homeరాజకీయంకమ్యూనిస్టు పాలన లేని దేశం...!

కమ్యూనిస్టు పాలన లేని దేశం…!

  • 50 ఏళ్లలో తొలిసారి

  • కేరళలో ఓటమితో నిరసించిన వామపక్ష భావజాలం

  • తొలుత పశ్చిమ బెంగాల్, తరువాత త్రిపుర.. ఒక్కో రాష్ట్రం అధికారానికి దూరం

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: కమ్యూనిస్టు.. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. అణగారిన వర్గాల గొంతుకగా, ప్రజా సమస్యల వారధిగా, ఎర్రజెండా నీడన విప్లవ భావజాలాన్ని రగిలించింది వామపక్షవాదం. ఒకప్పుడు ఈ దేశాన్ని గడగడ లాడించిన ఈ నినాదం.. ఇప్పుడు ఉనికిని వెతుక్కుంటుంది. ఒకప్పుడు దేశ రాజకీయాలను ఏలిన ఈ పార్టీ ఇప్పుడు పూర్తిగా పతనం అయ్యింది. లెఫ్ట్ పార్టీల కోటలు ఒక్కొక్కటి కూలిపోతున్నాయి. కేరళలో ఓటమితో వామపక్షం అనేది పూర్తిగా కనుమరుగు కావడం బాధ కలిగిస్తోంది.

ప్రత్యేక పాత్ర..
దేశ రాజకీయాల్లో వామపక్షాలది ప్రత్యేక పాత్ర. సిపిఎం, సిపిఐ, ఫార్వర్డ్ బ్లాక్, ఆర్ ఎస్ పి ల సమాహారం వామపక్ష కూటమి. చాలా రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం పాలించింది ఈ కూటమి. ప్రధానంగా పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపురాల్లో దశాబ్దాల పాటు పాగా వేసింది. బలమైన శక్తిగా కొనసాగింది. కానీ క్రమేపి తన ప్రభావాన్ని కోల్పోతూ వచ్చింది. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత తొలి సార్వత్రిక ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ.. విపక్షాలన్నింటి కంటే ఎక్కువ సీట్లు సాధించి దేశంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అక్కడకు ఐదేళ్లకు 1957లో కేరళలో విజయాన్ని సాధించింది. ప్రపంచంలో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన మొట్టమొదటి ప్రభుత్వం అది.

కానీ తదనంతర కాలంలో కమ్యూనిస్టు పార్టీలో చీలిక వచ్చింది. సిపిఐ, సిపిఎం గా వేరు పడ్డారు వామపక్ష భావజాలం ఉన్న నేతలు. 1977లో పశ్చిమ బెంగాల్ లో సిపిఎం అధికారంలోకి వచ్చింది. దాదాపు 34 సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఆ పార్టీ అధికారంలో ఉంది. 23 సంవత్సరాల పాటు జ్యోతిబసు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశారు. కానీ 2011లో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చేతిలో సిపిఎం ఓడిపోయింది. నాటి నుంచి వామపక్షాల పతనం ప్రారంభం అయింది. ఒక్కో రాష్ట్రం చేజారుతూ వచ్చింది. తొలుత పశ్చిమ బెంగాల్, తరువాత త్రిపుర, ఇప్పుడు కేరళలో ఆ పార్టీ పూర్తిగా పతనం అంచున నిలబడింది.

చిరస్మరణీయమైన విజయాలు..
దేశ రాజకీయ చరిత్రలో ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందుకున్నాయి వామపక్షాలు. 2004 లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 59 సీట్లు గెలుచుకుని నాడు యూపీఏ ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించాయి కమ్యూనిస్టులు. అప్పట్లో ప్రకాష్ కారత్, సీతారాం ఏచూరి వంటి నాయకులు ఢిల్లీ పీఠాన్ని శాసించారు. పశ్చిమ బెంగాల్ లో 34వేల తిరుగులేని పాలన, కేరళలో ప్రత్యామ్నాయ అధికార మార్పిడి, త్రిపురలో ఇనుపకోట వంటి విజయాలతో ఎర్రజెండా విశ్వరూపాన్ని చూపింది. కానీ 2011లో బెంగాల్లో ఓటమి, 2018లో త్రిపుర కోట చేజారడం, ఇప్పుడు ఏకంగా కేరళలో వచ్చిన ఫలితాలతో.. పూర్తిగా నిరసించి పోయాయి వామపక్షాలు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు