-
ఆరు దశాబ్దాలుగా ఆ రెండు పార్టీల మధ్య అధికార మార్పిడి
-
ఏడుసార్లు అన్న డీఎంకే, ఆరుసార్లు డిఎంకె అధికార పగ్గాలు
-
60 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఆనవాయితీని బ్రేక్ వేసిన విజయ్
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: తమిళనాడులో ద్రవిడ పార్టీల శకం ముగిసిందా? ఆరు దశాబ్దాల రెండు పార్టీల చరిత్రను విజయ్ టీవీకే వెనక్కి నెట్టిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తమిళనాడు పేరు చెప్పగానే ద్రవిడ పార్టీల పాలన గుర్తుకు వస్తుంది. తమిళనాడు ను గత ఆరు దశాబ్దాలుగా డీఎంకే, అన్నా డీఎంకే మాత్రమే పాలించాయి. 1967లో అన్నాదురై నుంచి మొదలుకొని ప్రస్తుతం ఎంకే స్టాలిన్ వరకు.. ఆ రెండు పార్టీలే శాసిస్తూ వస్తున్నాయి. దేశ రాజకీయాలను ఏలిన కాంగ్రెస్, బిజెపిలు సైతం తమిళనాడు ను టచ్ చేయలేకపోయాయి. కేవలం అధికార పార్టీలకు అవి మిత్రపక్షులుగా మాత్రమే మెలిగాయి. కానీ పార్టీ ఏర్పాటు చేసిన రెండేళ్ల వ్యవధిలోనే ఆ రెండు పార్టీలను చిత్తు చేసి తమిళనాడులో అధికారాన్ని హస్తగతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు విజయ్.
ఇప్పటివరకు మూడుసార్లు కాంగ్రెస్..
దేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. అటు తరువాత జరిగిన ఎన్నికల్లో తమిళనాడులో 1952 నుంచి వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. కానీ 1967లో డీఎంకే ఏర్పాటు అయిన తర్వాత ఆ పార్టీ తొలిసారి అధికారంలోకి వచ్చింది. అన్నా దురై మొట్టమొదటి డిఎంకె ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అన్నా దురై తరువాత కరుణానిధి డీఎంకే తరఫున ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే అప్పటివరకు డిఎంకెలో ఉన్న ఎంజి రామచంద్రన్ విడిపోయి అన్నా డిఎంకెను ఏర్పాటు చేశారు. అధికారంలోకి రాగలిగారు. అనంతరం మళ్లీ కరుణానిధి డిఎంకె అధికారంలోకి వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అటు తరువాత జయలలిత, పన్నీరు సెల్వం, పలని స్వామి, ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రులు అయ్యారు. ఆరు దశాబ్దాలుగా ఆ రెండు పార్టీల మధ్య మాత్రమే అధికార మార్పిడి జరిగింది. కానీ 1967 తర్వాత తొలిసారిగా ఇప్పుడు విజయ్.. ఆ రెండు పార్టీలను అధికారం నుంచి దూరం చేస్తూ టీవీకే పార్టీని గెలిపించుకున్నారు.
బలంగా నాటుకున్న సిద్ధాంతం..
తమిళనాడులో ద్రవిడ సిద్ధాంతం బలంగా నాటుకుంది. ద్రవిడ ఉద్యమ పార్టీలుగా, సాంఘిక సంస్కరణ సారథులుగా, తమిళ భాష పరిరక్షకులుగా, ఉత్తర భారత ఆధిపత్యాన్ని సవాల్ చేయడంలో.. డీఎంకే తో పాటు అన్న డీఎంకే పార్టీలు ముందు వరుసలో నిలిచాయి. తమిళనాడులో ఇప్పటివరకు అన్నాడీఎంకే ఏడుసార్లు, డీఎంకే ఆరుసార్లు అధికార పగ్గాలు చేపట్టాయి. మరో పక్షానికి అవకాశం ఇవ్వలేదు. కానీ తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఈ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే వాయువేగంతో దూసుకెళ్లింది. ఆరు దశాబ్దాల తరువాత ద్రవిడ పార్టీలకు అతీతంగా.. ఒక కొత్త పార్టీ దూసుకు రావడం విశేషం. 1967లో జాతీయ పార్టీల హవా ఎలా ముగిసిందో.. ఇప్పుడు ద్రవిడ పార్టీల పరంపరకు టీవీ కే విజయ్ అడ్డుకట్ట వేశారు. 1977లో ఎన్టీఆర్ ఆరోగ్యంలోని అన్నాడీఎంకే సాధించిన 30.4% ఓటు శాతాన్ని.. విజయ్ నేతృత్వంలోని టీవీకే 34.92 శాతంతో అధిగమించింది.