-
అవినీతి ఆరోపణలపై లీగల్ నోటీసులు
-
48 గంటలపాటు డెడ్ లైన్
-
బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
-
తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ హీట్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ హీట్. మంత్రి సీతక్క ఏకంగా మాజీ సీఎం కేసీఆర్ కు లీగల్ నోటీసులు పంపించడం సంచలనంగా మారింది. రాష్ట్ర రాజకీయాల్లోనే ఈ ఘటన ప్రకంపనలు రేపుతోంది. గత కొద్దిరోజులుగా గులాబీ పార్టీ సీతక్కను టార్గెట్ చేసుకుంది. ఆమె శాఖలో అవినీతి జరిగిందని చెబుతూ అనుకూల మీడియాతో పాటు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. దీనిపై ఘాటుగా స్పందించిన సీతక్క తప్పుడు ప్రచారం చేస్తే చెప్పుతో కొడతాను అంటూ గట్టిగానే హెచ్చరికలు పంపారు. అంతటితో ఆగకుండా కెసిఆర్ కు లీగల్ నోటీసులు పంపారు.
స్మార్ట్ ఫోన్లలో అవినీతి..
ఇటీవల అంగన్వాడీ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ స్మార్ట్ ఫోన్లు అందించింది. తక్కువ ధరవి అందించి.. ఎక్కువ కోడ్ చేశారని.. భారీగా నిధులు పక్కదారి పట్టించారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. మంత్రి సీతక్క శాఖలో భారీ అవినీతి అంటూ ప్రచారం జరుగుతోంది. దీనిపై ఘాటుగానే స్పందించారు మంత్రి సీతక్క. తనపై తప్పుడు ప్రచారాలు మానుకోకుంటే కచ్చితంగా బుద్ధి చెబుతానని… చెప్పుతో కొడతానని కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయినా సరే సోషల్ మీడియాలో వీటిపై తప్పుడు ప్రచారాలు మానడం లేదు. అదేపనిగా ప్రచారం చేస్తుండడంతో మంత్రి సీతక్క మరోసారి స్పందించారు. చట్టపరమైన పోరాటానికి సిద్ధమయ్యారు. గులాబీ పార్టీ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న ఆరోపణలు తన ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయని.. దీనికి ఆ పార్టీ అధినేతగా కేసీఆర్ ఏ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
లెక్కలతో కౌంటర్..
మంత్రి సీతక్క లెక్కలతో కౌంటర్ ఇవ్వడమే కాకుండా 48 గంటలపాటు డెడ్లైన్ విధించారు. బహిరంగ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. అంగన్వాడి ఫోన్లో కోసం కేటాయించిన మొత్తం టెండర్ విలువ రూ.44 కోట్లు అయితే.. అందులో రూ.30 కోట్లు అవినీతి జరిగిందని ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇది ప్రాథమిక గణిత సూత్రాలకు కూడా విరుద్ధమని.. కేవలం తనపై బురద చల్లడానికి అలాంటి అవాస్తవాలు ప్రచారాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. పారదర్శకంగా టెండర్ల ప్రక్రియ జరిగిందని.. ఇందులో దాచడానికి ఏమీ లేదని కూడా ఆమె చెప్పుకొచ్చారు. తన ప్రతిష్టను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను వెంటనే తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే ఈ వివాదం కేవలం లీగల్ నోటీసులతో ఆగిపోతుందా? లేకుంటే కోర్టు విచారణ వరకు వెళ్తుందా అన్నది సస్పెన్స్ గా మారింది. గులాబీ పార్టీ తన ఆరోపణలకు కట్టుబడి ఉంటే అందుకు తగ్గ ఆధారాలను బయటపెట్టాల్సి ఉంటుంది. లేకుంటే మాత్రం దీనిని అధికారపక్షం ప్రచార అస్త్రంగా మార్చుకునే అవకాశం ఉంది. అందుకే మంత్రి సీతక్క పంపిన ఈ లీగల్ నోటీసుకు గులాబీ పార్టీ ఎలా స్పందిస్తుందో అని సర్వత్రా చర్చ నడుస్తోంది.
