Delhi Liquor Policy Case: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో విచారణపై తనకు నమ్మకం లేదని ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ సంచనల వ్యాఖ్యలు చేశారు. ఈ కేసును విచారిస్తున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. గతంలో ఇదే కేసులో విచారణ సందర్భంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేస్తూ.. తాను, ఇతర నిందితులను ముందుగానే అవినీతిపరులుగా భావించినట్లు కనిపించిందన్నారు.
ఈ కేసు నుంచి జస్టిస్ స్వర్ణకాంత శర్మ తప్పుకోవాలి!
ఈ నేపథ్యంలో జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈ కేసు నుంచి తప్పుకోవాలని కోరుతూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఆయన స్వయంగా కోర్టులో వాదనలు వినిపించారు. చట్టపరంగా జడ్జి సరైన వ్యక్తి కాదా? అన్నది ముఖ్యమేమీ కాదని.. కానీ, కేసులో ఉన్న వ్యక్తికి న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉండటం ముఖ్యమని చెప్పారు. తన కేసుతో పాటు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న మరో కేసు మాత్రమే వేగంగా ముందుకు వెళ్తున్నాయని, మిగిలిన కేసుల్లో ఆ వేగం కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా, ట్రయల్ కోర్టు మూడు నెలల విచారణ తర్వాత తాము నిర్దోషులమని చెప్పినప్పటికీ, సీబీఐ హైకోర్టులో సవాల్ చేయగానే తొలిరోజే ఆ తీర్పును ప్రశ్నించిన తీరు సరైనది కాదన్నారు. గతంలో బెయిల్ పిటిషన్లపై విచారణ సమయంలో కూడా న్యాయమూర్తి తమపై చేసిన వ్యాఖ్యలు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఆయన విమర్శించారు.
న్యాయం లభించదనే సందేహం ఉంది!
అలాగే, జస్టిస్ స్వర్ణకాంత శర్మ గతంలో ఏబీవీపీ నిర్వహించిన కార్యక్రమాలకు హాజరైన విషయాన్ని కూడా కేజ్రీవాల్ ప్రస్తావించారు. తాను ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ భావజాలాన్ని వ్యతిరేకించే వ్యక్తినని, అలాంటి నేపథ్యం ఉన్న న్యాయమూర్తి నుంచి తటస్థమైన న్యాయం లభించదనే సందేహం ఉందన్నారు. అటు, కేజ్రీవాల్ వాదనలను సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తీవ్రంగా వ్యతిరేకించారు. జడ్జీలపై పక్షపాతం ఆరోపణలు చేస్తూ వారిని తప్పుకోవాలని కోరితే, భవిష్యత్తులో ఎవరూ కేసులు విచారించలేరన్నారు.
