తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన సొంత ప్రభుత్వంపైనే పరోక్షంగా విమర్శలు చేస్తూ అసెంబ్లీ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జరిగిన సభలో మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు సరైన నిధులు అందడం లేదని స్పష్టంగా ఆరోపించారు. ముఖ్యంగా మంత్రుల నియోజకవర్గాలకు మాత్రమే బిల్లులు మంజూరు అవుతున్నాయనే భావన రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించిందని తెలిపారు. ప్రభుత్వం అనేది కేవలం మంత్రులతో మాత్రమే పరిమితం కాకుండా, ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రజల అభివృద్ధికి సమాన బాధ్యత వహిస్తాడని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. నిధుల కోసం తాము మంత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండటంతో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా ఆ జిల్లాకే కేంద్రీకృతమవుతున్నాయనే చర్చ నడుస్తోందని, ఇది ఇతర నియోజకవర్గాలపై ప్రభావం చూపుతోందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నట్లే, మిగతా ఎమ్మెల్యేలు కూడా తమ తమ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకునే హక్కు ఉందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మునుగోడును అభివృద్ధి చేయాలని ఆశపడ్డామని, కానీ ఆ దిశగా సరైన సహకారం అందడం లేదని పేర్కొన్నారు.
ఇదే సందర్భంలో మరో అంశాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్రంలోని లిఫ్ట్ ప్రాజెక్టులు కూడా సమానంగా పంపిణీ కావడం లేదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్ నియోజకవర్గానికి లిఫ్ట్‌లు ఎక్కువగా మళ్లిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోందని అన్నారు. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్రంగా చూస్తే మంచి నిర్ణయాలు తీసుకుంటూ, క్రమశిక్షణతో పాలన కొనసాగిస్తున్నదని కూడా ఆయన అంగీకరించారు. అదే సమయంలో, నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో సమానత్వం పాటించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ పెద్దలను కోరారు. ముఖ్యంగా మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి అన్ని ప్రాంతాలకు సమానంగా చేరాలంటే నిధుల పంపిణీ పారదర్శకంగా ఉండాలని, ప్రతి ఎమ్మెల్యేకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు.
ALSO READ: సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు సవాల్
