పదివేల మందితో భారీ పాదయాత్ర
కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టుకు
రాజకీయాలకు సంబంధం లేదు…
కొండగట్టును అన్ని విధాలుగా అభివృద్ది చేస్తా
కరీంనగర్, క్రైమ్ మిర్రర్: కొండగట్టును అభివృద్ధి చేసే బాధ్యత తాము తీసుకుంటామని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్ర పేరిట కరీంనగర్లోని మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు వరకు మహా పాదయాత్ర చేపట్టారు. కేంద్ర మంత్రితో పాటు ఇటీవల గెలుపొందిన కార్పొరేటర్లు ఆయన వెంట ఉన్నారు.
కరీంనగర్ మేయర్ పీఠం భాజపా కైవసమైతే కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కలిసి కొండగట్టు అంజన్న ఆలయానికి కాలినడకన వచ్చి మొక్కులు తీర్చుకుంటానని ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్ ప్రకటించారు. ఈ మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు, 10 వేల మంది కార్యకర్తలతో కలిసి సంజయ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
తన కొండగట్టు పాదయాత్ర రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ’అంజన్న ఆశీర్వాద’ పేరుతో శనివారం మహా పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. కరీంనగర్ మహాశక్తి అమ్మవారి దేవాలయం నుంచి కొండగట్టు అంజన్న ఆలయం వరకు ఈ పాదయాత్ర కొనసాగుతోందని తెలిపారు.
కొండగట్టు అంజన్న ఆశీర్వాదంతో కరీంనగర్ పీఠం కైవసం…
కొండగట్టు అంజన్న ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదంతో కరీంనగర్ కార్పొరేషన్లో విజయం సాధించామని బండి సంజయ్ పేర్కొన్నారు. మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు వరకు ఈ పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు. . పదోతరగతి పరీక్షలు ఉన్నందున విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ పాదయాత్ర కొనసాగుతోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఎన్డీయే భాగస్వామ్య ప్రభుత్వమని చెప్ప్పుకొచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమ ఎన్డీయే కూటమి మిత్రుడేనని తెలిపారు. కొండగట్టు అభివృద్ధికి టీటీడీ నిధులను పవన్ కల్యాణ్ కేటాయించారని ప్రస్తావించారు. \
సర్వేజన సుఖినోభవంతు మా నినాదం…
బీఆర్ ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు కొండగట్టు అభివృద్దిని విస్మరించాయని విమర్శించారు. ప్రసాదం స్కీమ్ కింద కొండగట్టు, వేములవాడ, ఇల్లందకుంట ఆలయాలను అభి వృద్ది చేస్తామని చెప్పారు తరువాత పట్టించుకోలేదన్నారు. ఎంఐఎంను తాము భూస్థాపితం చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. ’సర్వేజన సుఖీనోభవంతు మా నినాదం’ అని చెప్ప్పుకొచ్చారు.
తుంగుర్తి ఎమ్మెల్యేపై దేశ ద్రోహం కేసు పెట్టాలి…
తుంగతుర్తి ఎమ్మెల్యే బ్రాహ్మణుల మీద మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నానని
అన్నారు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి అని ఆరోపించారు. హిందువుల గురించి అనుచితంగా మాట్లాడే పరిస్థితి కాంగ్రెస్ సర్కార్లో వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మళ్లీ ఎలా గెలిస్తారో చూస్తామని హెచ్చరించారు. తుంగతుర్తిలో ఆయన పతనం ప్రారంభ మైందని ధ్వజమెత్తారు. హిందు దేవుళ్లను మోసం చేసి మరో దేవుడు దగ్గరకు ఆయన ఎలా వెళ్తారని ప్రశ్నించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మీద మత విధ్వేషాలను రెచ్చిగొట్టినందుకు కేసు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
