పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం శాంతిభద్రతలను కాపాడేందుకు కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ‘పశ్చిమ బెంగాల్ ప్రజా భద్రత, సంఘ వ్యతిరేక కార్యకలాపాల నిరోధక బిల్లు–2026’కు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ చట్టం ప్రకారం, ప్రజా భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉందని ప్రభుత్వం భావించే వ్యక్తిని విచారణ లేకుండానే గరిష్ఠంగా ఒక సంవత్సరం వరకు జైల్లో నిర్బంధించే అవకాశం ఉంటుంది.
ఈ బిల్లును తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. బిల్లుపై మాట్లాడిన సీఎం సువేందు అధికారి.. సమాజంలో కొందరు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు తెస్తున్నారని చెప్పుకొచ్చారు. అలాంటి చర్యలను అరికట్టడమే ఈ కొత్త చట్టం ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ బిల్లులో అసాంఘిక కార్యకలాపాలకు నిర్వచనాన్ని కూడా విస్తరించారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం, చట్టబద్ధమైన వ్యాపారాలు, కార్యకలాపాలకు అడ్డంకులు కల్పించడం, భూకబ్జాలు, బలవంతపు వసూళ్లు, అక్రమ మైనింగ్, ఇసుక తవ్వకాలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం లాంటి చర్యలను ఈ చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. అలాగే గూండా అనే పదానికి కూడా మరింత విస్తృత నిర్వచనం ఇచ్చారు. ప్రజా శాంతికి భంగం కలిగించే అవకాశం ఉందని అధికారులు భావిస్తే, సంబంధిత వ్యక్తిపై ప్రివెంటివ్ డిటెన్షన్(PD) విధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అవసరమైతే ఈ నిర్బంధాన్ని విచారణ లేకుండానే ఏడాది వరకు కొనసాగించవచ్చు.
ఇదే సమయంలో ప్రభుత్వం మరో బిల్లును కూడా అసెంబ్లీలో ఆమోదింపజేసింది. పశ్చిమ బెంగాల్ శాంతిభద్రతల (సవరణ) బిల్లు–2026 ప్రకారం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయనున్నారు. అల్లర్లు, హింసాత్మక ఘటనల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం అయితే, అందుకు కారణమైన వ్యక్తులను గుర్తించి వారి నుంచి నష్టపరిహారం వసూలు చేసే అధికారం ఈ కమిషన్‌కు ఉంటుంది. విధ్వంసానికి నేరుగా పాల్పడిన వారితో పాటు, వారిని ప్రోత్సహించిన, ఆర్థికంగా సహాయం చేసిన వారిపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అవసరమైతే వారి ఆస్తులను జప్తు చేసి వేలం వేసి నష్టపరిహారం వసూలు చేసే నిబంధనలను కూడా ఈ చట్టంలో పొందుపరిచారు.