Vijay Thalapathy: తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీతో సంచలనం సృష్టించిన కోలీవుడ్ నటుడు విజయ్ ఇప్పుడు రాజకీయంగా మాత్రమే కాదు.. వ్యక్తిగత జీవితంతో కూడా వార్తల్లో నిలుస్తున్నారు. పార్టీ స్థాపించిన కేవలం రెండేళ్లలోనే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటింగ్ సాధించి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విజయ్ ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవిపై దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ కుటుంబ సభ్యుల గురించి కూడా ప్రజల్లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారనే వార్తలు పెద్ద చర్చకు దారితీశాయి. ఆ తరువాత విజయ్ కుమారుడు జైసన్ సినిమాలు, సోషల్ మీడియా కార్యకలాపాలపై నెటిజన్లు దృష్టి పెట్టగా.. ఇప్పుడు ఆయన కుమార్తె దివ్య సాషా గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

విజయ్ కుమార్తె దివ్య సాషా 2005 సెప్టెంబర్ 9న చెన్నైలో జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 20 సంవత్సరాలు. సినీ కుటుంబంలో జన్మించినప్పటికీ దివ్య మాత్రం పూర్తిగా వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యం ఇస్తోంది. సినీ వేడుకలు, గ్లామర్ ప్రపంచం, సోషల్ మీడియా ప్రచారాలకు దూరంగా ఉండే దివ్య ప్రస్తుతం ఉన్నత విద్యపై పూర్తిగా దృష్టి పెట్టినట్లు సమాచారం. చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంచుకున్న ఆమె అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్‌లో మంచి ప్రతిభ కనబర్చినట్లు తెలిసింది. చెన్నైలోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తి చేసిన దివ్య, ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సినీ రంగానికి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ దివ్య సాషా చిన్నప్పుడే వెండితెరపై కనిపించింది. 2016లో విడుదలైన విజయ్ నటించిన ‘తేరి’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదే ఆమెకు తొలి సినీ ప్రవేశంగా నిలిచింది. అయితే ఆ సినిమా తర్వాత దివ్య మళ్లీ ఎలాంటి చిత్రాల్లో కనిపించలేదు. ప్రస్తుతం ఆమె పూర్తి దృష్టిని చదువుపైనే కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో కూడా దివ్య చాలా అరుదుగా మాత్రమే కనిపిస్తుంది. ఎలాంటి వ్యక్తిగత వివరాలు బయటకు రాకుండా జాగ్రత్తపడుతూ ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగిస్తోంది. రాజకీయాలు, సినిమాలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే విజయ్ కుటుంబంలో దివ్య మాత్రం నిశ్శబ్ద జీవితం గడపడం ఇప్పుడు నెటిజన్లలో మరింత ఆసక్తిని పెంచుతోంది.
ALSO READ: Tilak For Children: తిలకం, విభూతి వల్ల పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుతుందా..?