గుంటూరు, క్రైమ్ మిర్రర్: చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని వేజెండ్ల గ్రామానికి చెందిన సాతర్ల తిరుపతమ్మ తన ఇంటిలో గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి మెయిన్ డోర్ తెరిచి, ఇనుప బీరువా తాళాలు పగులగొట్టి సుమారు రూ.9,00,000/- విలువైన 72 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు కొన్ని వెండి ఆభరణాలు దొంగిలించారని ఫిర్యాదు చేశారు.దీనిపై చేబ్రోలు పోలీస్ స్టేషన్ ఎస్సై వీరనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కేసు దర్యాప్తులో భాగంగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు తెనాలి డీఎస్పీ జనార్ధన్ రావు పర్యవేక్షణలో, పొన్నూరు రూరల్ సర్కిల్ సీఐ శ్రీ కృష్ణయ్య , చేబ్రోలు ఎస్సై వీరనారాయణ , సిబ్బంది కలిసి కొత్తరెడ్డిపాలెం సెంటర్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక అనుమానిత వ్యక్తి పోలీసులను గమనించి పారిపోవడానికి ప్రయత్నించగా, వెంటనే అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో సదరు వ్యక్తి ఫిర్యాదిదారురాలి భర్త సాతర్ల గోపి (36 ) గుండవరం గ్రామ నివాసి అని తేలింది. కుటుంబ విభేదాల కారణంగా భార్యాభర్తలు విడిగా ఉంటున్నారని, భార్య తన తల్లి ఇంటి వద్ద వేజెండ్ల గ్రామంలో నివసిస్తోందని విచారణలో వెల్లడైంది.నిందితుడు మద్యం సేవించడం, పేకాట వంటి చెడు వ్యసనాలకు బానిసై డబ్బుల అవసరం ఏర్పడటంతో తన అత్తగారింట్లో చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు.