Homeక్రైమ్DGP Video Scandal: సస్పెండ్ అయిన డీజీపీకి మరో దెబ్బ, ఆ వీడియోలు నిజమేనని తేల్చిన...

DGP Video Scandal: సస్పెండ్ అయిన డీజీపీకి మరో దెబ్బ, ఆ వీడియోలు నిజమేనని తేల్చిన సిట్‌!

కర్ణాటకలో సంచలనం రేపిన డీజీపీ రామచంద్రరావు వీడియోల వివాదంపై కీలక మలుపు తిరిగింది. వైరల్‌ అయిన వీడియోలు నిజమైనవేనని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) స్పష్టం చేయడంతో ఈ కేసు మరింత సంచలనం కలిగిస్తోంది. ఈ వ్యవహారంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్రరావు చిక్కుల్లో పడ్డారు.

రెండు నెలల క్రింత వెలుగులోకి ఆ వీడియోలు!

రెండు నెలల క్రితం పోలీసు శాఖ చాంబర్‌లోనే ఇద్దరు మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు బయటకు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం, రామచంద్రరావును సస్పెండ్‌ చేస్తూ విచారణ కోసం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఏడీజీపీ హితేంద్ర నేతృత్వంలో ప్రత్యేక బృందం ఈ కేసును లోతుగా పరిశీలించింది.

నిజమైన వీడియోలేనని తేల్చిన సిట్

వీడియోలు బయటకు వచ్చిన తర్వాత రామచంద్రరావువాటిని పూర్తిగా ఖండించారు. అవి డీప్‌ఫేక్‌ లేదా ఏఐ సాయంతో రూపొందించిన నకిలీ వీడియోలని వాదించారు. అయితే సిట్‌ ఆధునిక సాంకేతిక పద్ధతులతో వీడియోలను విశ్లేషించి కీలక నిర్ధారణకు వచ్చింది. వీడియోల్లో ఎలాంటి డీప్‌ఫేక్‌ లక్షణాలు లేవని, అవి పూర్తిగా నిజమైనవేనని తేల్చింది.

ప్రభుత్వానికి 100 పేజీల నివేదిక

దాదాపు 100 పేజీల నివేదికను సిట్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికతో కేసు కొత్త దశలోకి వెళ్లింది. ఒక ఉన్నత స్థాయి పోలీసు అధికారి ఇలాంటి ఆరోపణల్లో చిక్కుకోవడం ప్రజల్లో ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పుడు ప్రభుత్వంపై తదుపరి చర్యలపై ఒత్తిడి పెరుగుతోంది. కేవలం సస్పెన్షన్‌తో సరిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ కేసు కేవలం వ్యక్తిగత వ్యవహారం కాకుండా, పోలీసు వ్యవస్థ ప్రతిష్టకు సంబంధించినదిగా మారింది. దీంతో ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారింది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు