మధ్యప్రదేశ్ లోని శివ్ పురి పట్టణంలో ఓ వీధి కుక్క చేసిన దాడులు స్థానికులను భయాందోళనకు గురి చేశాయి. ఒకే రోజులో దాదాపు 60 మందిపై దాడి చేసి కరిచిన ఘటన కలకలం రేపింది. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
అసలేం జరిగిందంటే?
నల్ల రంగు వీధి కుక్క పట్టణంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ రోడ్డుపై కనిపించిన వారిపై అకస్మాత్తుగా దాడి చేసింది. ఎలాంటి కారణం లేకుండానే ప్రజలను వెంటాడి కరిచడంతో చాలామంది గాయపడ్డారు. ఈ ఘటనలతో ప్రజలు తీవ్ర భయానికి గురయ్యారు. దాడికి గురైన వారిలో రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో ఆ చిన్నారిపై కుక్క దాడి చేయగా, స్థానికులు వెంటనే స్పందించి కుక్కను తరిమికొట్టారు. దీంతో మరింత పెద్ద ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
బాధితులకు రేబిస్ టీకాలు
కుక్క దాడిలో గాయపడిన వారిని జిల్లా ఆస్పత్రితో పాటు సమీప ఆరోగ్య కేంద్రాలకు తరలించారు. బాధితులకు అవసరమైన వైద్య చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. రేబిస్ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని గాయపడిన వారందరికీ యాంటీ రేబిస్ టీకాలు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెప్పారు.
కుక్కను పట్టుకున్న మున్సిపల్ సిబ్బంది
ఘటనపై సమాచారం అందుకున్న శివ్‌పురి మున్సిపాలిటీ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. ప్రజలపై దాడులు చేస్తున్న కుక్కను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. కొంతసేపటి ప్రయత్నం తర్వాత కుక్కను విజయవంతంగా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. వీధి కుక్కలు అనుమానాస్పదంగా ప్రవర్తించినా లేదా ఎవరిపైనైనా దాడి చేసినా వెంటనే మున్సిపల్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు.