Homeక్రైమ్కోదాడలో నకిలీ ఆయిల్ కలకలం.. 20 టిన్లు స్వాధీనం

కోదాడలో నకిలీ ఆయిల్ కలకలం.. 20 టిన్లు స్వాధీనం

క్రైమ్ మిర్రర్ : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో నకిలీ ఆయిల్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సీసీఎస్‌ పోలీసులు, హెచ్‌పీసీఎల్‌ కంపెనీ ప్రతినిధులు కలిసి నిర్వహించిన తనిఖీల్లో అనుమానాస్పదంగా ఉన్న 20 ఆయిల్‌ టిన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. కోదాడలోని మేళ్లచెరువు రోడ్డులో ఉన్న ఓ ఆటోమొబైల్‌ దుకాణంలో నకిలీ హైడ్రాలిక్‌ ఆయిల్‌ను విక్రయిస్తున్నారనే సమాచారం కంపెనీ ప్రతినిధులకు అందింది. దీంతో వారు పోలీసులను సంప్రదించగా, సీసీఎస్‌ సిబ్బంది మంగళవారం సదరు దుకాణంలో తనిఖీలు చేపట్టారు.

తనిఖీల సమయంలో హెచ్‌పీసీఎల్‌ బ్రాండ్‌ పేరుతో ఉన్న కొన్ని ఆయిల్‌ టిన్లు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వాటిని పరిశీలించారు. కంపెనీకి చెందిన అసలైన ఉత్పత్తులతో పోల్చి చూడగా ప్యాకేజింగ్‌, తయారీ వివరాలు తదితర అంశాల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో మొత్తం 20 ఆయిల్‌ టిన్లను స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న ఉత్పత్తులను కంపెనీ ప్రతినిధుల సమక్షంలో పరిశీలించిన పోలీసులు.. వాటి తయారీ నాణ్యత, ప్యాకేజింగ్‌, లేబుల్స్‌, సరఫరా మార్గాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ఆయిల్‌ నిజంగా నకిలీదేనా అనే విషయాన్ని నిర్ధారించేందుకు నమూనాలను సంబంధిత పరీక్షలకు పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు దుకాణానికి ఈ ఆయిల్‌ ఎక్కడి నుంచి చేరింది? దీన్ని సరఫరా చేసిన వ్యక్తులు ఎవరు? ఇప్పటికే ఇతర దుకాణాలకు లేదా ప్రాంతాలకు ఇలాంటి ఉత్పత్తులను పంపించారా? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. దుకాణ యజమానులను కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం. కంపెనీ ప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదు, పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చే ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నకిలీ ఉత్పత్తుల తయారీ, విక్రయం వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
also read : ప్రేమ పేరుతో నమ్మించి.. దూరం పెట్టడంతో ట్రైనీ డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు