Homeక్రైమ్దారుణం : తల్లితో కలిసి తండ్రిని హతమార్చిన కుమారుడు

దారుణం : తల్లితో కలిసి తండ్రిని హతమార్చిన కుమారుడు

క్రైం మిర్రర్: చిన్నచిన్న కుటుంబ విభేదాలు, కోపతాపాలు చివరకు ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకున్న విషాద ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో చోటుచేసుకుంది. చాలా కాలంగా కొనసాగుతున్న దాంపత్య కలహాలు గురువారం రాత్రి తీవ్ర రూపం దాల్చగా, తల్లితో కలిసి కుమారుడు తండ్రిపై దాడి చేసిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
పోలీసుల వివరాల ప్రకారం.. కదంబాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని తుర్కకాశిపల్లికి చెందిన సయ్యద్ మస్తాన్ (40) గత కొంతకాలంగా భార్యతో విభేదాలు ఎదుర్కొంటున్నాడు. గత ఆరు నెలలుగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని పంచాయతీ నిర్వహించినప్పటికీ పరిస్థితి మారలేదని తెలుస్తోంది. కుటుంబంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా మస్తాన్ కొంతకాలంగా మెట్‌పల్లి ప్రాంతంలో నివసిస్తున్నట్లు సమాచారం.
మూడు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చిన మస్తాన్ తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. గురువారం రాత్రి భార్యతో మాట్లాడేందుకు ఆమె వద్దకు వెళ్లగా మరోసారి వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి తీవ్ర ఘర్షణకు దారితీయడంతో అక్కడే ఉన్న కుమారుడు సయ్యద్ అలీ (18) మట్టి పెల్లతో తండ్రిపై బలంగా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అదే సమయంలో తల్లి కూడా చేతిలో ఉన్న నీళ్ల సీసాతో కొట్టినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
దాడిలో తీవ్రంగా గాయపడిన మస్తాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న సుల్తానాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు.
సుల్తానాబాద్ ఎస్‌ఐ చంద్రకుమార్ మాట్లాడుతూ, మృతుడి తండ్రి సయ్యద్ గోరెమియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కుటుంబ కలహాలే ఈ దారుణ ఘటనకు కారణమా? లేక మరే ఇతర అంశాలు ఉన్నాయా? అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. కుటుంబ సభ్యుల మధ్య నెలకొనే విభేదాలు సమయానికి పరిష్కారం కాకపోతే ఎంతటి విషాదాలకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
also read : ఉచిత పథ‌కాలకు కోర్టు బ్రేక్…! పూర్తి వివ‌రాల‌తో అఫిడవిట్ దాఖలు చేయాల‌ని ఆదేశం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు