నగరంలో నిబంధనలకు విరుద్ధంగా మందుల విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో టీజీ సేఫ్ అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించిన 111 మెడికల్ షాపులపై అధికారులు చర్యలకు శ్రీకారం చుట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆయా దుకాణాల నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
మంగళవారం నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో భాగంగా నగరంలోని పలు మెడికల్ షాపుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మందుల విక్రయానికి సంబంధించిన రికార్డులు, ప్రిస్క్రిప్షన్లు, బిల్లులు, ఫార్మసిస్ట్ అందుబాటులో ఉన్నారా లేదా అనే అంశాలను పరిశీలించారు.
తనిఖీల సమయంలో కొన్ని మెడికల్ షాపుల్లో డాక్టర్ చీటీ లేకుండానే ప్రిస్క్రిప్షన్ మందులను విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ లేకుండా మందులు అందించడం, వినియోగదారులకు బిల్లులు ఇవ్వకపోవడం వంటి లోపాలు కూడా బయటపడ్డాయి.
మత్తు ప్రభావం కలిగించే, ప్రిస్క్రిప్షన్ తప్పనిసరిగా అవసరమైన మందులను వైద్యుల సూచన లేకుండా విక్రయించడం చట్టవిరుద్ధమని టీజీ సేఫ్ అధికారులు స్పష్టం చేశారు. ఇటువంటి మందుల విక్రయాలపై ప్రత్యేకంగా నిఘా కొనసాగుతుందని తెలిపారు.
ప్రిస్క్రిప్షన్ మందులను తప్పనిసరిగా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ జారీ చేసిన చీటీ ఆధారంగానే విక్రయించాలని టీజీ సేఫ్ కమిషనర్ మెడికల్ షాపుల నిర్వాహకులను హెచ్చరించారు. నిబంధనలు పాటించకుండా మందులు విక్రయించే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఇకపై కూడా తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘనలు బయటపడితే మెడికల్ షాపుల లైసెన్సులను రద్దు చేయడంతో పాటు అవసరమైతే ప్రాసిక్యూషన్ చర్యలు కూడా చేపడతామని అధికారులు హెచ్చరించారు. ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని మందుల విక్రయాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
also read: వైద్యం పేరుతో యువతిపై అసభ్య ప్రవర్తన.. డాక్టర్ అరెస్ట్
