•తీవ్రంగా స్పందించిన జాతీయ మానవ హక్కుల కమిషన్
•రాష్ట్ర బిజెపితోపాటు విజయవాడ పోలీస్ కమిషనర్ కు నోటీసులు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:-
ఏపీలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ హక్కుల న్యాయవాది రామారావు ఇచ్చిన ఫిర్యాదు పై కమిషన్ స్పందించింది. ఏపీ డీజీపీతోపాటు విజయవాడ పోలీస్ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. ఘోరమైన ఈ ఘటనపై వారం రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. కస్టోడియల్ టార్చర్ ను దాచేందుకు.. మృత దేహాన్ని కాల్చివేసి.. ఆ బూడిదను నదిలో కలిపారని ఆరోపణలపై కమిషన్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో అక్రమ నిర్బంధం, కస్టడీ హింస జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రాథమికంగా నిర్ధారించింది.
చార్జ్ షీట్ తో స్పష్టం..
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు కృష్ణలంక సీఐ నాగరాజు. ఓ కేసులో సాయి కృష్ణను అదుపులోకి తీసుకుంది టాస్క్ ఫోర్స్ పోలీస్ బృందం. తరువాత ఆయనను సీఐ నాగరాజుకు అప్పగించారు. అటు తర్వాత సాయి కృష్ణ కనిపించకుండా మానేశారు. ఈ తరుణంలో ఆయన తల్లి విజయలక్ష్మి పలుమార్లు పోలీసులను ఆశ్రయించింది. ఆమె పట్ల పోలీసులు అమానుషంగా మాట్లాడారు. దీంతో తన కొడుకు ఆచూకీ కోసం ఆమె హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సాయి కృష్ణను కోర్టులో హాజరు పరచాలని ఆదేశాలు ఇచ్చింది. కానీ కేసు తీవ్రతను గుర్తించిన సీఎం చంద్రబాబు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రత్యేక బృందం చాలా వేగవంతంగా విచారణ మొదలుపెట్టింది. కోర్టులో చార్జ్ షీట్ సైతం దాఖలు చేసింది. లాకప్ డెత్ తో సాయి కృష్ణ మరణించినట్లు పేర్కొంది. దీంతో పోలీసుల చేతుల్లో సాయి కృష్ణ మృతి చెందినట్లు నిర్ధారణ జరిగింది. ఈ తరుణంలోనే జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు అందింది.
కీలక ఆదేశాలు..
జాతీయ మానవ హక్కుల కమిషన్ కీలక ఆదేశాలు ఇచ్చింది. పోలీస్ స్టేషన్లోని సిసి ఫుటేజీని కావాలని డిలీట్ చేశారని ఆరోపణలు వస్తున్న క్రమంలో తక్షణమే రికవరీ చేయాలని ఆదేశించింది. నిజా నిజాలను నిగ్గు తేల్చేందుకు నదిలో కలిపిన బాధితుడి అస్థితులను వెతికి తీయాలని కమిషన్ సూచించింది. కుమారుడ్ని కోల్పోయి న్యాయం కోసం పోరాడుతున్న బాధితుడు తల్లి గాధ విజయలక్ష్మి కి పోలీసులు తక్షణమే పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని స్పష్టం చేసింది. సాక్షాలను తారుమారు చేయకుండా.. బాధితులకు ఎలాంటి హాని జరగకుండా చూడాలని పేర్కొంది.