Homeతెలంగాణకొండల్ రెడ్డి పై గురి...!

కొండల్ రెడ్డి పై గురి…!

  • వ్యూహాత్మక విమర్శలు చేస్తున్న కేటీఆర్

  • సీఎం రేవంత్ ఫ్యామిలీ పై అవినీతి మరక వేసే ప్రయత్నం

  • తిప్పి కొట్టలేకపోతున్న హస్తం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో గులాబీ పార్టీ వ్యూహాత్మక దాడి చేస్తోంది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ పై గురి పెట్టింది. ముఖ్యంగా ఆయన సోదరుడు కొండల్ రెడ్డి పై పదే పదే విమర్శలు గురిపెడుతోంది. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని రావిర్యాలలో టెస్సరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్రైవేటు లిమిటెడ్ అనే సంస్థకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ద్వారా ఐదు ఎకరాల పారిశ్రామిక భూమిని తక్కువ ధరకు కేటాయించారని కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు.

మార్కెట్లో దాదాపు 200 కోట్ల రూపాయల విలువైన ఈ భూమిని ప్రభుత్వం కేవలం 7.5 కోట్ల రూపాయలకు అప్పనంగా కట్టబెట్టింది అన్నది కేటీఆర్ ఆరోపణ. ఇదే విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి పేరును బయటకు తీసి అవినీతి మరక అంటించే ప్రయత్నం చేస్తున్నారు గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

  • స్పష్టమైన వైఫల్యం..

సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబంపై ప్రతిపక్షం ఓ స్థాయిలో ఆరోపణలు చేస్తుంటే.. తిప్పి కొట్టడంలో అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కనిపిస్తోంది. సాధారణంగా ముఖ్యమంత్రి లేదా ఆ స్థాయి నేతల కుటుంబ సభ్యులు తమపై వచ్చే రాజకీయ ఆరోపణలపై నేరుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడరు.

పార్టీ మంత్రులతో పాటు శ్రేణులు మూకుమ్మడి దాడులు చేయాలి. కానీ కాంగ్రెస్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు పైనే నేరుగా ఆరోపణలు చేస్తున్నా ఆ పార్టీ నేతలకు కనీసం పట్టినట్టు లేదు. సాధారణంగా పారిశ్రామిక భూముల కేటాయింపు అనేది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది.

అర్హత కలిగిన సంస్థలకు మాత్రమే భూముల కేటాయింపు ఉంటుంది. పైగా గులాబీ పార్టీ ఆరోపిస్తున్నట్టు ఆ సంస్థలతో కొండల్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు. అటువంటప్పుడు ప్రొఫైల్ ఆధారాలపై పక్కా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో రేవంత్ ప్రభుత్వం మీడియాకు సమగ్ర వివరణ ఇస్తే ఈ ప్రచారానికి బ్రేక్ పడుతుంది. గులాబీ పార్టీ చేసే ప్రయత్నాలను ఎండగట్టినట్లు అవుతుంది.

  • కుటుంబ అవినీతి అంశం ప్రాధాన్యం…

గతంలో కెసిఆర్ ఫ్యామిలీ పై వచ్చిన అవినీతి ఆరోపణలతోనే భారత రాష్ట్ర సమితి ఈ స్థితికి తెచ్చుకుంది. కుటుంబ అవినీతిపై తెలంగాణ సమాజంలో చర్చ జరిగింది. ఇప్పుడు రేవంత్ ఫ్యామిలీ పై అదే మాదిరిగా చర్చ జరగాలన్నది కేటీఆర్ ప్రణాళిక. అందుకే ఈ కంపెనీకి భూముల కేటాయింపును ప్రధానంగా చేసుకొని కేటీఆర్ వరుస ఆరోపణలు చేస్తున్నారు.

ఈ కంపెనీ ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ… ఈ సంస్థకు అంత సీన్ లేదని.. కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో ప్రారంభించారని.. కొండల్ రెడ్డి లింకెడ్ ఇన్ ప్రొఫైల్లో ఈ సంస్థకు సంబంధం ఉన్నట్లు ఉందని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై తెలంగాణ ఐటి పరిశ్రమల శాఖామంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఖండించారు.

అధికారిక నిబంధనలకు, పారిశ్రామిక విధానాలకు లోబడే భూమి కేటాయింపులు జరిగాయని స్పష్టం చేశారు. అయినా సరే వ్యూహాత్మకంగా కేటీఆర్ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. దానిని ఎదుర్కోవడంలో మాత్రం కాంగ్రెస్ వ్యూహాత్మక తప్పిదం కనిపిస్తోంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు